YSRCP : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్దేశించిన అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారాణంగా నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తున్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాము అంతర్గతంగా విచారణ జరిపి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశామని గుర్తించామన్నారు. ఆ నలుగురు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈ నలుగురిలో ఇద్దరిని వైసీపీ హైకమాండ్ ముందుగానే పరిగణనలోకి తీసుకోలేదు. కోటంరెడ్డి, ఆనం ఇద్దరికీ వైసీపీ హైకమాండ్ ఎవరికి ఓటేయాలో చెప్పలేదు. అయితే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం క్యాంపులో ఓట్లు ఎలా వేయాలో ప్రాక్టీస్ చేయించి..ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించారు. చివరికి వారు టీడీపీ అభ్యర్థికి ఓటేసినట్లుగా వైసీపీ హైమకమాండ్ గుర్తించింది. తాము ప్రత్యేకంగా ఓ కోడ్ పెట్టుకున్నామని ఆ కోడ్ ఆధారంగా గుర్తించి వారిపై సస్పెన్షన్ వేటు వేశామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కొన్నారని సజ్జల ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ. పదిహేను నుంచి రూ. ఇరవై కోట్ల వరకూ డబ్బులు ఇచ్చారన్నారు.
దర్యాప్తులో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగుర్ని గుర్తించామన్న సజ్జల
అయితే వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగానే పార్టీని ధిక్కరించారు. వీరిద్దరికీ వైసీపీ పార్టీ నాయకత్వం విప్ కూడా జారీ చేయలేదు. అయితే ఆనం రామనారాయణరెడ్డి పలుమార్పు తమ పార్టీ విప్ ప్రసాదరాజును..ఓటు ఎవరికి వేయాలని అడిగినప్పటికీ సమాధానం చెప్పకపోవడంతో అంతరాత్మ ప్రభోధం ప్రకారం వేసినట్లుగా తెలుస్తోంది. అయితే తాను వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థికే ఓటు వేశానని ఆనం రామనారాయణరెడ్డి తన సన్నిహితులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డికి కూడా ఎలాంటి విప్ జారీ చేయలేదు. దాంతో ఆయన టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.
తాము క్రాస్ ఓటింగ్ చేయలేదంటున్న ఉండవల్లి, మేకపాటి
మరో వైపు తాము క్రాస్ ఓటింగ్ చేశామని వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు స్పందించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తాము చెప్పిన వారికే ఓటు వేశామని వారు అంటున్నారు. అయితే తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే సస్పెండ్ చేస్తున్నామని సజ్జల ప్రకటించారు. మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి చివరి రోజు అసెంబ్లీకి హాజరు కాలేదు. కోటంరెడ్డిని తొలి రోజునే అసెంబ్లీ సమావేశాల నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
వేగంగా చర్యలు తీసుకున్న సజ్జల
సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని ఇదేమీ ఉద్యోగం కాదని రాజకీయం అని సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం వ్యాఖ్యానించారు. అయితే ఒక్క రోజులోనే సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీని ధిక్కరించారని తెలిసినా చర్యలు తీసుకోలేకపోతే...పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతాయన్న అభిప్రాయం వినిపించడంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు వారు ఇతర పార్టీల్లో ఇబ్బంది లేకుండా చేరవచ్చు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతా వేటు పడదు.