వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీతో  ఉన్న స్నేహ సౌభ్రాతృత్వాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇచ్చిపుచ్చుకునే రాజకీయం చేస్తున్నారు. పార్లమెంట్‌లో రాజ్యసభలో అవసరం అయినప్పుడల్లా వైసీపీ ఎంపీలు అడగకుండానే బీజేపీకి మద్దతిస్తున్నారు. అలాగే.. ఏపీలో జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఎక్కడా బీజేపీ అభ్యంతరాలు చెప్పడం లేదు. మూడు రాజధానులు అయినా..  రివర్స్ టెండర్లు అయినా జగన్ ఇష్టానికే వదిలేసింది. స్థానిక ఎన్నికలు సహా అనేక అంశాలపై   ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అది బీజేపీతో వైసీపీకి ఉన్న సాన్నిహిత్యం. 


అయితే బీజేపీకి సిద్ధాంతకర్తలాంటి ఆరెస్సెస్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతేరికిస్తోంది.  ఆయనను ఏ మాత్రం సహించకూడదన్నంత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆరెస్సెస్‌కు ఆర్గనైజర్ అనే పత్రిక ఉంది. అందులో దేశ కాల మాన పరిస్థితులపై ఆరెస్సెస్ భావజాలాన్ని విస్తృత పరిచే రచయితలు...  ఆర్టికల్స్ రాస్తూంటారు.  పదిహేడో తేదీన పబ్లి,ష్ అయిన ఆర్గనైజర్‌ వారపత్రికలో జగన్ ను తీవ్రంగా విమర్శిస్తూ ఆర్టికల్‌ను ప్రచురించారు. ప్రధానంగా.. మత మార్పిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషించారు. రఘురామకృష్ణరాజుపై దాడి.. . ఆ తర్వాత పరిణామాలు... ఏపీలో పోలీసులు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ.. కేవలం జగన్ కోసం పని చేస్తున్న వైనాన్ని ఆ కథనంలో విశ్లేషించారు. రేపు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రధాని మోడీతో పాటు సుప్రీంకోర్టుపై సైతం ఆయన దాడి చేస్తారని ఆర్టికల్‌లో ప్రచురించారు. 


నిజానికి ఆర్గనైజర్ ఇలాంటి కథనం ప్రచురించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తుగ్లకీ జగన్ పేరుతో.. ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అందులో మూడు రాజధానుల నిర్ణయాన్ని  వ్యతిరేకించింది. జగన్ అమరావతిని నిర్వీర్యం చేసి.. ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో విశ్లేషించింది. సందర్భం ఉన్నప్పుడల్లా... సీఎం జగన్‌ను ఆరెస్సెస్ విమర్శిస్తూనే ఉంది. బీజేపీ పార్టీ వ్యవహారాలను ఆరెస్సెస్ తరపున పరిశీలించేందుకు రాష్ట్రానికో పార్టీ పరిశీలకుడు ఉంటారు. గతంలో సతీష్ జీ అనే వ్యక్తి ఉండేవారు. ఇటీవల.. ఆయనను మార్చి శివప్రకాష్ జీ అనే నేతను నియమించారు. ఆయన ఏపీకి వచ్చి వరుసగా సమావేశాలు నిర్వహించి వెళ్లారు. ఆ తర్వాత జగన్‌పై ఆరెస్సెస్ పత్రికలో మరింత విస్తృతంగా వ్యతిరేక కథనాలొస్తున్నాయి. 



బీజేపీ పెద్దలకు...  ఆరెస్సెస్ సిద్ధాంతాలే ముఖ్యం. ఆరెస్సెస్ పెద్దలు చెప్పినట్లుగా చేస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో.. ఆరెస్సెస్‌కు...  మోడీ  , షాలకు చెడిందన్న ప్రచారం జరుగుతూ వస్తోంది.  ఆరెస్సెస్ అభీష్టానికి వ్యతిరేకంగా  మోడీ, షాలు జగన్ ను ప్రోత్సహిస్తున్నారన్న అసంతృప్తి ఆరెస్సెస్‌లో ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఆరెస్సెస్ .. ఏ విషయాలనైనా సహిస్తుంది కానీ.. మత మార్పిళ్లను సహించదు. ఇప్పుడు ఏపీలో అదే అంశంపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి...  కేంద్రం మనసు మార్చుకుంటే... జగన్మోహన్ రెడ్డి సర్కార్‌కు ... కష్టాలు ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. అయితే ఈ పరిస్థితిని ఎలా డీల్ చేసుకోవాలో జగన్ అంతరంగీకులైన విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు బాగా తెలుసని అంటున్నారు.