Roja On Politics : రుషికొండ ప్యాలెస్‌పై జరుగుతున్న ప్రచారం అంతా తప్పేనని మాజీ పర్యాటక మంత్రి రోజా అన్నారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె రుషికొండపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవన్నారు. తామేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదని.. సెవెన్‌ స్టార్‌ రేంజ్‌లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించామన్నారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్ అంత లగ్జరీగా నిర్మించామన్నారు. వేరే దేశాల నుంచి పర్యాటకులు వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చు.. లేదంటే ఎవరికైనా లీజుకు ఇచ్చుకోవచ్చన్నారు.  కట్టింది ఖరీదైన భవనం  కాబట్టి ఖరీదైన ఫర్నీచర్ ఉంటుందని చెప్పుకొచ్చారు. 


40 శాతం ఓట్లు వచ్చినా పదకొండు సీట్లేనా ?         


ఎన్నికల ఫలితాలపైనా రోజా అనుమానం  వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి నలభై శాతం ఓట్ల లోపే వచ్చాయని ఆయన ప్రధాని అయ్యారన్నరు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి కూడా నలభైలశాతం ఓట్లే వచ్చాయని అయినా సీఎం అయ్యారన్నారు. కానీ ఏపీలో జగన్ కు నలభై శాతం ఓట్లు వచ్చినా పదకొండు సీట్లే వచ్చాయన్నారు. 


ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ లేదు !


ఆడుదాం ఆంధ్రా పేరుతో వంద కోట్లు రూపాయలు దోచేశారని తనపై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.  ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారని స్కామ్‌ ఇలా కూడా అవుతుందా అని ప్రశ్నించారు.  క్రీడాకారులకు  నగదు బహుమతులు  ఇచ్చామన్నారు.   అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు  తాను నిర్వహిస్తున్న క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదనన్నారు. తాను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం కరెక్ట్ కాదన్నారు. 


టీడీపీ నేతలు దాడులు ఆపాలి !                                         


రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారని రోజా ఆరోపించారు.  ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలన్నారు.   వచ్చే ఐదేళ్ల పాటు కష్టపడి మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటామని రోజా తెలిపారు. 


రోజాపై తీవ్ర ఆరోపణలు                                    


టూరిజం మంత్రిగా ఉన్న రోజా కనుసన్నల్లోనే రుషికొండ భవన నిర్మాణం జరిగింది. ఆ భవనంలో ఐదు వందల కోట్ల ఖర్చు చూపి భారీగా అవినీతి  చేశారని.. రూపాయి వస్తువును వెయ్యి రూపాయలుగా చూపించి దోచేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ దగ్గర నుంచి రోజా బెంజ్ కారు పొందారని  కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై విచారణ చేయిస్తామని.. అసెంబ్లీలో అన్ని విషయాలను బయట పెడతామనిచెబుతున్నారు.