AP Rains Latest News | అమరావతి: ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, పరివాహక ప్రాంతాల్లోని అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల పిడుగుల వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
వర్షంతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ గాలుల వల్ల చెట్లు కూలడం లేదా విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయట ఉన్న వారు వెంటనే సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు ఉన్నాయని, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేసింది. వాతావరణం వేగంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో, ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు, బయట తిరిగే వారు తక్షణమే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని కోరారు. చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడటం ప్రాణాపాయమని హెచ్చరించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపిస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని, ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
ఎల్లో అలర్ట్: పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని, చెట్ల కిందకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
