Facilities for devotees with technology:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా శ్రీవారి క్షేత్రాన్ని ప్రపంచస్థాయి అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలను ఆవిష్కరించారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు క్యూలైన్లలో ప్రవేశించిన క్షణం నుండి దర్శనం పూర్తయ్యే వరకు వారికి అందుతున్న సేవలను ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, సమస్యలను ముందస్తుగా గుర్తించి పరిష్కరించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. టీటీడీ అనుసరిస్తున్న ఈ ఆధునిక విధానాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.                

Continues below advertisement

ఈ సందర్భంగా ప్రారంభించిన  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ , తిరుమల పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మికత, సేవ, సాంకేతికత, స్థిరత్వం అనే నాలుగు ప్రధాన సూత్రాలపై ఆధారపడి రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం టీటీడీ పరిధిలోని 63 ఆలయాలను డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేశారు. భవిష్యత్తులో ఈ సేవలను దేశ రాజధానులు మరియు విదేశాల్లోని హిందూ సమాజానికి కూడా విస్తరించాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆలయాలను కేవలం దర్శనీయ స్థలాలుగానే కాకుండా, భక్తులకు మానసిక ప్రశాంతతను ,ఆధ్యాత్మిక పరివర్తనను కలిగించే కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని సీఎం వివరించారు.

సాంకేతిక వినియోగంలో భాగంగా ప్రవేశపెట్టిన  గోవింద యాప్  భక్తుల రద్దీ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ సాంకేతికత సాయంతో భక్తులు వేచి ఉండే సమయాన్ని అంచనా వేసి, తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దర్శన సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఉదాహరణకు, గత వైకుంఠ ఏకాదశి సమయంలో వేచి ఉండే సమయాన్ని 11 గంటల నుండి 8 గంటలకు తగ్గించడం ఈ వ్యవస్థ సాధించిన విజయానికి నిదర్శనం. దీనికి తోడు విమానాశ్రయ స్థాయి భద్రతా తనిఖీలు, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్స్,  పేపర్‌లెస్ సేవలను అమలు చేస్తూ భక్తుల భద్రతను, సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్నారు. ఎన్ఆర్ఐ దాత  జయప్రసాద్ వెజెండ్ల, కార్య ఫౌండేషన్ సహకారంతో ఈ సేవలన్నీ భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.                           

Continues below advertisement

ఆధ్యాత్మికతతో పాటు తిరుమల పర్యావరణ పరిరక్షణకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు. భవిష్యత్తులో తిరుమల కొండపై గాలి, శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నివారించేలా ప్రైవేట్ వాహనాలను పరిమితం చేసి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వంద శాతం పెంచాలని సూచించారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్య రహిత తిరుమల లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. అన్నదానం, ప్రాణదానం వంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, శ్రీవారి సేవకులకు వారి నైపుణ్యం ఆధారంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు.