AP Debts: ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల తీరు తప్పంటూ రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) కు 25 వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడంలో బ్యాంకులు నిబంధనలు పాటించలేదని రిజర్వు బ్యాంకు పేర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్పొరేషన్లకు ఇలాంటి అప్పులు ఇచ్చే క్రమంలో నిబంధనల్నీ పాటించాలని తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన అప్పులు నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో సమీక్షించి ఆయా బ్యాంకులు బోర్డులకు నివేదికలు ఇవ్వాలని ఆర్బీఐ నిర్దేశించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లు ఏపీఎస్ డీసీ (AP SDC) అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలో పస లేదని అర్థమైంది. 


విజయ సాయిరెడ్డి ఏం అడిగారు..?


వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే  రుణాల చెల్లింపులో ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోందా అని ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందా లేదా అని ఒకవేళ అది నిజమైతే రాష్ట్రానికి వ్యతిరేకంగా అంతటి తీవ్ర నిర్ణయం తీస్కోవడానికి కారణం ఏంటని, ఏపీఎస్ డీసీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం పట్ట రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ధ్రువీకరించిన విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా అంటూ అడిగారు. 


కేంద్రమంత్రి ఏం చెప్పారంటే..!


వీటన్నిటికి సమాధానంగా కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఏసీఎస్ డీసీ సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, మరికొన్ని స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం మొదట్లో రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశిస్తున్న నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తున్న కారణంగా ఇలాంటి రుణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని 2022 మార్చిలో రాష్ట్రాలకు చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న ఏదైనా పన్ను, సెస్, ఏ రకమైన రాష్ట్ర రాబడిని ఇందుకోసం వినియోగించినా అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితిని నిర్ణయించేందుకు వీటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. 


ఇలాంటి కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదని ఆర్బీఐ తెలియజేసింది. మార్గ దర్శకాలు సరిగ్గా అనుసరించాలని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకులు సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు రుణాలు ఇచ్చేటప్పుడు వాటి లాభదాయకత ఎంత, ఆ అప్పు అంతిమంగా ఎక్కడ ఉపయోగపడుతుందో అంచనా వేయాలన్నారు. ఆ సంస్థలు తిరిగి ఎలా చెల్లిస్తున్నాయో పరిశీలించాలని చెప్పారు. కార్పొరేషన్ల వ్యవహారంలో బ్యాంకులు ఇలా అంచనా వేయడంలో నిబంధనలు పాటించడం లేదని ఆర్బీఐ తెలిపింది. నిబంధనలు ఏ మేరకు అనుసరించారో పేర్కొంటూ బ్యాంకులు తమ పాలక మండళ్లకు నివేదిక పంపాలని కూడా ఆర్బీఐ ఆదేశించిందన్నారు. ఏపీఎస్ డీసీ రుణాలు తీసుకుంటున్న తీరుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం అందిందని లేఖలో పేర్కొన్నారు.