YSRCP MPP :  వైఎస్ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి స్వరాలు పెరిగిపోతున్నాయి. బిల్లులు రావడంలేదని కొంత మంది పనులు చేయలేకపోతున్నామని మరికొందరు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది తమపై కుల వివక్ష చూపిస్తున్నారని పదవికి తగ్గ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి ఎంపీపీ గంటిమల్ల విజయలక్ష్మి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే నిరనస వ్యక్తం చేశారు. తనపై కుల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నేలపై కూర్చున్నారు. దీంతో మిగిలిన సభ్యులతో పాటు సభను నిర్వహిస్తున్న అధికారులు కూడా ఆమెను నిరసన విరమించాల్సిందిగా బతిమాలాల్సి వచ్చింది. 


ఎంపీపీగా ఎన్నికైనా తన విధులను తనను నిర్వహించనీయడం లేదని గంటిమల్ల రాజ్యలక్ష్మి ఆవేదన


ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గంటిమల్ల రాజ్యలక్ష్మి ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలానికి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ మద్దతుదారుగా ఆమె ఉన్నారు. ఎంపీపీని అయినప్పటికీ తనకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని.. అధికారిక కార్యక్రమాలు సహా ఏ విషయంలోనూ సమాచారం రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీకి దక్కాల్సిన కనీస ప్రోటోకాల్ కూడా దక్కకపోవడంతో ఆమె నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు.  మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు.  


ఎలాంటి ప్రోటోకాల్ పాటించడం లేదని కింద కూర్చుని నిరసన


నిజానికి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సింది ఎంపీపీ ఆధ్వర్యంలోనే. అయితే ఆమెకు మాత్రం ఈ సమావేశం ఎజెండా పూర్తి వివరాలు కూడా తెలియవు. కొంత కాలంగా  స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఎంపీపీ నైన తన విషయంలో ప్రోటోకాల్ పాటించట్లేదని, మండలంలో  ఏ కార్యక్రమాలు జరిగినా తనను పిలవడం కూడా లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎంపీపీ అందరి దృష్టిలో పడేలా నిరసన చేశారు.  ఎస్టీ కులానికి చెందిన తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.   రౌతులపూడి మండల సర్వసభ్య సమావేశంలో నేల పైన కూర్చుని నిరసన తెలిపినట్లుగా ప్రకటించారు. 


వైఎస్ఆర్‌సీపీ మండల కన్వీనర్ పెత్తనంపై ఆగ్రహం ? 


ఎంపీపీగా గంటిమల్ల రాజ్యలక్ష్మిని రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేసినప్పటికీ ఆ మండల పెత్తనం అంతా వైఎస్ఆర్‌సీపీ మండల కన్వీనర్‌గా ఉన్న జిగిరెడ్డి శ్రీను అనే నాయకుడు చూసుకుంటాడు. మొదటి నుంచి  ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. ఎంపీపీని, వైస్ ఎంపీపీని పట్టించుకోకుండా ఆయనే  నిర్ణయాలు తీసుకుంటారని ... అధికారులు కూడా ఆయనకే  మద్దతుగా ఉంటారని చెబుతూంటారు. ఈ క్రమంలో గంటిమల్ల రాజ్యలక్ష్మి ఆయన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా తన మాట వినకపోవడంతో అందరికీ తెలిసేలా నిరసన చేసినట్లుగా తెలుస్తోంది. 


రూ.1,600 కోట్లకు గ్యారెంటీ, ఆ చట్టంలో సవరణలకు ఆమోదం - ఏపీ క్యాబినెట్ మరిన్ని కీలక నిర్ణయాలు