RGV Meet Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిశారు. హఠాత్తుగా తాడేపల్లిలో ప్రత్యక్షమైన ఆయన సీఎం జగన్‌తో లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. ఆర్జీవీతో సీఎం జగన్ సమావేశంపై సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. అధికారికమైన భేటీ కాదని.. సీఎం హోదాలో కాకుండా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి హాోదాలోనే ఆర్జీవీతో జగన్ సమావేశమయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ ప్రచారం కోసం ఆర్జీవీ ఆలోచనలను ఉపయోగించుకోవాలని సీఎం జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీకి మేలు చేసేలా ఇతరుల ఇమేజ్ డ్యామేజ్ చేసేలా గతంలో ఆర్జీవీ సినిమాలు
గత ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్‌సీపీకి ఎంతో మేలు చేశారు. ఆ పార్టీ నేతలు నిర్మాతలుగా వ్యవహరించడంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు. ఆ సినిమా ధియేటర్లలో పెద్దగా ఆడనప్పటికీ.. విడుదలకు ముందు రాజకీయంగా ఎంత చర్చ జరగాలో అంతా జరిగింది. సినిమా మాధ్యమం ద్వారా జరిగే ప్రచారం ప్రభావవంతంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల ముందు కూడా ఇలాంటి కొన్ని సినిమాలను ప్లాన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారని అందుకే ఆర్జీవీని పిలిపించి మాట్లాడారని చెబుతున్నారు.
ఆర్జీవీతో మూడు సినిమాలు రూపొందించే యోచనలో వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు
మొత్తం మూడు సినిమాలను .. ఎన్నికల్లో తమకు మేలు కలిగేలా ఆర్జీవీతో నిర్మింప చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఆ పొత్తును టార్గెట్ చేస్తూ ఉండేలా ఓ సినిమాను రూపొందించనున్నట్లుగా చెబుతున్నారు. గతంలో ఆర్జీవీ వంగవీటి అనే సినిమాను తీశారు. కానీ పెద్దగా ఆడలేదు. ఆ సినిమా సమయంలో వంగవీటి తనయుడు రాధాకృష్ణతో వివాదం తెచ్చుకున్నారు. ఆయనపై విమర్శలు చేశారు. అలాగే పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంలోనూ ప్రజలకు మరింతగా చెప్పాలని ..అది ఆర్జీవీ అయితేనే బెటర్‌గా ఉంటుందని వైఎస్ఆర్సీపీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పవన్ మూడు పెళ్లిళ్ల అంశంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు విస్తృతంగా విమర్శలు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగా సినిమా ఉంటుందని అంటున్నారు.
మూడు సినిమాలపై ఆర్జీవీతో జగన్ చర్చించారా ?
ఆర్జీవీ సినిమాలన్నీ రొటీన్ అయిపోయాయి. ఎలాంటి సినిమా తీసినా ఎవరూ చూడటం లేదు. కనీసం రిలీజ్ కావడం లేదు. చివరికి నట్టి కుమార్ అనే నిర్మాతతో వివాదాలు పెట్టుకుని సినిమాలు రిలీజ్ కాకుండా చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఓటీటీలోనూ ఆయన సినిమాలు తీసుకోవడానికి సంస్థలు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి మూడు సినిమాల ఆఫర్ వైఎస్ఆర్‌సీపీ నుంచి వస్తే అంగీకరించకపోవడానికి ఆయన వద్ద కారణం ఏదీ ఉండదని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే.. టీడీపీ, జనసేనను టార్గెట్ చేసుకుని ఆర్జీవీ మూడు వివాదాస్పద రాజకీయ సినిమాలు జనంపైకి వదలడం ఖాయమని అనుకోవచ్చు.