ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో హాట్ హాట్‌గా సాగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యలు, చేష్టలతో అందర్నీ కడుపుబ్బా నవ్వించారు. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల నుంచి దూరమై అమెరికాలోనే ఉంటున్నా.. అడపాదడపా ఇక్కడి పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా మళ్లీ ఆయన చేసిన కామెడీ వ్యాఖ్యలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలను కోట్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు.


తాజాగా కేఏ పాల్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన లైవ్ చేశారు. ఈ సందర్భంగా పాల్ మరోసారి ఊహకందని, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వీడియోలో పాల్ మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ ముఖ్యమంతి కావాలన్నా, మంత్రి అవ్వాలన్నా.. ఒక ఉపాయం ఉంది. పవన్ అభిమానులందరికీ నేను చెబుతున్నా.. మీకు కనీసం ఒక్క శాతం నీతి, నిజాయతీ ఉన్నా పవన్ కల్యాణ్‌ను మా ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుని, మీరు ‘ఎస్’ అంటే నేనే ప్రధాన మంత్రి అవుతాను. కావాలంటే పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని చేసేద్దాం. దాంట్లో తప్పేముంది?” అంటూ చెప్పుకొచ్చారు. చాలా సేపు పాల్ మాట్లాడినా.. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన షార్ట్ వీడియో మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.


దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘హే.. పవన్ కల్యాన్ సర్! నేను కాబోయే ప్రధాన మంత్రి కేఏ పాల్‌‌ను చెబుతున్నారు విను” అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియోను కూడా జత చేశారు. పవన్ కల్యాణ్ సహా కేఏ పాల్‌‌ వ్యవహార శైలిపై రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. ఇటీవల కూడా పవన్‌ కల్యాణ్‌ - రానా సినిమా ‘భీమ్లా నాయక్’ తనకి నచ్చిందని ట్వీట్ చేశారు. సినిమా అంతా ఉరుములు, మెరుపులు అంటూ పవన్‌ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచారు. తాజాగా కేఏ పాల్‌ వ్యాఖ్యలపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.