ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది.- ఈనేపథ్యంలోనే ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో భారీ సభకు రూపకల్పన చేస్తోంది.
తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మందితో ఏలూరులో ఈ నెల 30 న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ వెల్లడించారు.. ఈమేరకు రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నేతలతో బుధవారం సాయంత్రం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉభయగోదావరి జిల్లాల్లోని అయిదు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా కార్పోరేషన్లు ఛైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఏలూరులో 30న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాగా ఈ సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
ఈనేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా అంతా కృషిచేయాలని, అదేవిధంగా అభిప్రాయబేధాలు, ఇతర అంశాలన్నీ పక్కనపెట్టి అంతా భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఎన్నికలకు సిద్ధమని చెప్పడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మార్గాని భరత్ తెలిపారు.. గతంలో ఏలూరులో బీసీ బహిరంగ సభ ఏవిధంగా విజయవంతం అయ్యిందో దానికి మించి లక్షలాది మందితో ఈ సభ జరగనుందన్నారు. ఎన్నికలకు తాము సిద్ధమని చెప్పే విధంగా ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని ఎంపీ తెలిపారు.
ఎన్నికలకు సన్నద్ధత కోసమేనా..
ఇప్పటికే టీడీపీ పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా ఈ సభలకు చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నింపుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ కూడా భారీ బహిరంగ సభల ద్వారా జనసమీకరణ చేపడుతోంది. ఈక్రమంలోనే ముందుగా ఏలూరు వేదికగా వైసీనీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని ముఖ్యనేతలు చెబుతున్నారు...
భారీ జన సమీకరణ చేయాలని ఆదేశం..
ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడం ద్వారా ఏలూరు సభను విజయవంతం చేయాలన్నది వైసీపీ ప్రణాళికగా తెలుస్తోంది. ఈనేపధ్యంలోనే రాజమండ్రి వేదికగా నిర్వహించిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంచార్జ్, ఎంపీ మిథున్‌రెడ్డి ఇదేవిషయం దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా ఇదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా తెలియజేశారు. వైసీపీ ప్రజల్లో బలంగా ఉందని, వైసీపీ వెంటే ప్రజలున్నారన్న విషయం మరింత తెలియజెప్పేందుకు ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కూడా ముఖ్యనేతలు చెబుతున్నారు...
మిథున్ రెడ్డికి వినతుల వెల్లువ..
రాబోయే ఎన్నికల్లో తమకు టిక్కెట్టు కేటాయిస్తే తప్పక విజయాన్ని సాధిస్తామని పలువురు వైసీపీ ఆశావాహులు రాజమండ్రి క్యూకట్టారు.. ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్ మిథున్ రెడ్డి ద్వితియశ్రేణి నాయకత్వాన్ని కూడా ఓపికగా పిలిపించుకుని వారితో మాట్లాడారు. వారి చేతుల్లో బయోడేటా పట్టుకుని మరీ తమను ఒకసారి పరిశీలించాలని మరీ చెప్పుకున్నారు.. ఇదిలా ఉంటే పలువురు ఆశావాహుల్ని నేరుగా మిథున్ రెడ్డే పిలిపించారని తెలుస్తోంది. అయితే సమావేశానికి ఇప్పటికే ఆయా నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా ఎమ్మెల్యేలుండగా అదే స్థానంలో టిక్కెట్టు ఆశిస్తున్నవారు కూడా రాజమండ్రి తరలివచ్చారు. అయితే వారు ఎదురెదురు పడినా మాట్లాడుకోని పరిస్థితి కనిపించింది.