AP Elections News 2024: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారా..? పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టిక్కెట్టు ఆశించి భంగపడ్డ వారు చాలా మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరి పార్టీ టిక్కెట్టు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారట. 


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా అధికార వైఎస్సార్‌ సీపీలో నలుగురు వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు టిక్కెట్టు కోల్పోయారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పటికే టచ్‌లోకి వెళ్లిపోగా ఒక్క వైసీపీ నాయకులే కాదు ఇతర పార్టీలో ఉన్న వారు కూడా కాంగ్రెస్‌ గనుక టిక్కెట్టు హామీ ఇస్తే వెంటనే జంప్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది నేరుగా కడపకు క్యూ కడుతున్నారట.. డైరెక్ట్‌గా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అపాంయింట్‌మెంట్‌ తీసుకుని మరీ కలిసి వస్తున్నారు.. ఏపీలో ఏమాత్రం ఓటు షేరులేని కాంగ్రెస్‌ పార్టీ వైపుకు మరి ఎందుకు చూస్తున్నారు? అసలు కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో భవిష్యత్తు ఉందా అని అడిగితే.. మా ఉనికిని చాటుకోవాడానికి అయితే పనికొస్తుంది కదా అంటూ బదులిస్తున్నారట. 


పి.గన్నవరం ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి..
పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ సారి టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారిలో ముందు వరుసలో ఉన్నారు.. ఆయనకు కాదని ఇక్కడ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న విప్పర్తి వేణుగోపాలరావుకు వైసీపీ టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో మిగిలిపోగా ఆయన చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. వైసీపీ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లినా కనీసం తలుపు తీయని పరిస్థితి కనిపించింది. చాలా సేపు వేచి చూశాక చివరకు వచ్చి ముభావంగా పాంప్లెట్‌ తీసుకున్నారు. అయితే ఈ అసంతృప్తి వెనుక ఉన్న రివేంజ్‌ను ఎలా తీర్చుకోవాలి.. ఆయన అనుచరులు చాలా మంది స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని సలహా ఇచ్చారట.. అయితే ఆయన దానికి అంగీకరించకపోగా చివరకు జమ్మలమడుగు వెళ్లిమరీ వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.


రివేంజ్‌ తీర్చుకునేందుకు వేదికగా కాంగ్రెస్‌
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఎన్నికల ప్రచారం నుంచి పోలీంగ్‌ బూత్‌ ఏజెంట్లును ఏర్పాటు చేసుకుని ఆఖరికి లెక్కింపు ఏజెంట్లు ఏర్పాటు వరకు ఒకటే ఖర్చు.. ఎలా చూసుకున్నా తడిపి మోపెడవుతోంది.. మరో పక్క ఇండిపెండెంట్‌ అభ్యర్ధికి ఏ గుర్తు వస్తుందో తెలియదు.. విధం చెడినా ఫలితం దక్కాలన్న సామెత ఇక్కడ పనిచేస్తోందట.. జాతీయ పార్టీ, పైగా హస్తం గుర్తు అందరికీ తెలిసిన గుర్తు.. ఎంతో కొంత ఎన్నికల ఫండిరగ్‌ రానే వస్తుంది... ఇంక భయం ఎందుకు అభయ హస్తం ఉండగా అంటూ కాంగ్రెస్‌ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారట.. అయితే వీటికన్నిటికంటే ప్రధానంగా ఇందులో ఏదోలా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యమే ఎక్కువగా దాగుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనను కాదని వేరే అభ్యర్ధికి టిక్కెట్టు ఇస్తారా... అంటే టిక్కెట్టు కేటాయించిన వాని కంటే తానే పనికిరానివాడనా... కనీసం ఓ అయిదువేల ఓట్లు అయినా చీల్చలేనా.. అంటూ ఎన్నికల బరిలో కాలు దువ్వుతున్నారట.. అవసరమైతే కొన్ని చోట్ల ప్రత్యర్ధితో సైతం టచ్‌లో వెళ్లి కాంగ్రెస్‌ తరపున పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నాను.. నా ప్రచారానికి మీరు కూడా సహకరించండి.. మీకు చాలా ప్రయోజనం ఉంటుందని భరోసా ఇస్తున్నారట.. 


మరింత మంది కాంగ్రెస్‌లోకి చేరిక..
ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిక్కెట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ కూడా ఎప్పటినుంచో కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌నే నమ్ముకున్న వారు ఈ పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారట.