Malladi Krishna Rao vs Ponnada Sathish: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ఉండే పుదుచ్చేరి యానాం రాజకీయం పక్కనే ఉన్న ఆంధ్రాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రభావం చూపుతుందా.. అంటే దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది..


వృద్ధగౌతమి నది కుడి గట్టును ఆనుకుని, ఇదే నది కోరింగవైపుగా ఆత్రేయ నదిగా విడిపోయిన మధ్య భూభాగం యానాం ప్రాంతం.. వృద్ధగౌతమి ఎడమ గట్టును ఆనుకుని ఉన్న ప్రాంతం ఎక్కువ భాగం ముమ్మిడివరం. యానాం తరువాత ఉన్న తాళ్లరేవు మండలంతోపాటు అటు కాకినాడ జిల్లాలోని కోరంగిని ఆనుకుని ఉన్న చాలా ప్రాంతం అంతా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోనిదే.. ఇదిలా ఉంటే ముమ్మిడివరం నియోజకవర్గంలో యానాం రాజకీయ ప్రభావం తీవ్రంగా పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ముమ్మిడివరం నియోజకవర్గంలో అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికం. ఈ నియోజకవర్గంలో సుమారు 50 వేలకు పైబడి ఉన్నట్లు అంచనా.. ముమ్మిడివరం ఎవరు పాగా వేయాలన్నా ఈ సామాజిక ఓట్లు అత్యంత కీలకం. అయితే ఈ సారి ఈ ఓట్లు ఎవరి పరం కానున్నాయన్న దానిపై తీవ్ర సందిగ్ధత తలెత్తింది..


మల్లాడి ఓటమితో విభేదాలు తారాస్థాయికి..
యానాంలో తిరుగులేని రాజకీయ శక్తిగా మల్లాడి కృష్ణారావు ఎదిగారు. 2021లో జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. అయితే తన ఓటమికి ప్రధాన కారణం ముమ్మిడివరం ఎమ్మెల్యేగా ఉన్న పొన్నాడ సతీష్‌ అని అనేక సందర్భాల్లో ఆరోపించారు. పొన్నాడ సతీష్‌ కూడా మల్లాడి కృష్ణారావు సామాజిక వర్గమే అయినప్పటికీ ఇద్దరి మధ్య చాలా దూరం ఏర్పడింది.  మత్స్యకారుల ఓట్లలో చీలక తెచ్చి ప్రత్యర్ధి గెలుపొందేలా పావులు కదిపారన్నది పొన్నాడ సతీష్‌పై మల్లాడి కృష్షారావు ప్రధాన ఆరోపణ..


పొన్నాడను ఓడిస్తానని మల్లాడి శపథం..
1996 నుంచి ఓటమి ఎరుగని ప్రజాప్రతినిధిగా ఉన్న తనను 2021లో ఓటమికి పరోక్షంగా కారణంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఉన్నాడన్న కారణంగా మల్లాడి కృష్ణారావు చాలా గుర్రుగా ఉన్నారు. మల్లాడి, పొన్నాడ ఇద్దరూ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలేకాగా ఇప్పుడు పొన్నాడను ఓడించేందుకు తగిన సమయంగా మల్లాడి కృష్ణారావు భావించి ముందుకు వచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే పొన్నాడ ప్రత్యర్ధి ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్ధి దాట్ల సుబ్బరాజుకు మద్దతు తెలిపిన మల్లాడి కృష్ణారావు ఆయన తరపున మత్స్యకార ప్రాంతాల్లో ప్రచారం కూడా చేపడ్తున్నారు. 


వివాదానికి కారణమిదేనా.. 
అగ్నికుల క్షత్రియులకు పెద్దదిక్కుగా మల్లాడి కృష్ణారావును వ్యవహరిస్తారు. అయితే 2009లో తొలిసారిగా తన అనుచరుడిగా ఉన్న పొన్నాడ సతీష్‌ను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి పరిచయం చేసి ముమ్మిడివరం టిక్కెట్టు ఇప్పించారు మల్లాడి. ముమ్మిడివరం ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నాడ సతీష్‌ చాలాకాలం మల్లాడితో సత్సంబంధాలు కొనసాగించారు. 2019లో ఎన్నికల సమయంలో కూడా ఇద్దరి మధ్య బాగానే సంబంధాలు కొనసాగాయి.. అయితే ఎన్నికల అనంతరం మాత్రం ఆంధ్ర పాలిటిక్స్‌లో యానాం ఎమ్మెల్యేగా ఉన్న మల్లాడి కృష్ణారావు జోక్యాన్ని వద్దనుకున్న పరిస్థితి కనిపించింది.. ఈ క్రమంలోనే మత్స్యకారుల సముద్రంలో ఆయిల్‌ గ్యాస్‌ కంపెనీల వల్ల నష్టపోతున్న క్రమంలో పరిహారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌తో ఏర్పాటు చేసిన సమావేశానికి, ఆతరువాత చాలా కార్యక్రమాలకు మల్లాడిని దూరం పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడినట్లయ్యింది.


ఇంతలోనే 2021లో యానాం ఎన్నికలు జరగడం, మల్లాడి ఓటమి చెందడంతో మరింత దూరం పెరిగింది. మల్లాడికి కార్‌ యాక్సిడెంట్‌ అయినా కనీసం పలకరించలేదని, అదేవిధంగా పొన్నాడ కుటుంబంలో రెండు సార్లు యాక్సిడెంట్‌కు గురై మృతిచెందినా ఆయనా వెళ్లలేదన్న టాక్‌ నడుస్తుంది.. ఏదిఏమైనా ఈసారి ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు పొన్నాడకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రత్యర్ధి, కూటమి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజుకు బాగా అనుకూలత ఉండే పరిస్థితి కనిపిస్తుందని సమాచారం.