AP Rains Today | అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శనివారం సాయంత్రం 7 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 35.3 అడుగులు అందని పేర్కొన్నారు.

ఉమ్మడి గోదావరి జిల్లాలు అప్రమత్తం..

ధవళేశ్వరం వద్ద రాత్రి 7 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 4.44 లక్షల క్యూసెక్కులు ఉందని  ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మండల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. తుంగభద్ర నది 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని వెల్లడించారు.

గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికి  చేరనప్పటికీ దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. సోషల్ మీడియాలోని వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు.

ఆదివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.

శనివారం సాయంత్రం 7 గంటల నాటికి పాడేరులో 70 మిమీ, కర్నూలు జిల్లా కృష్ణగిరిలో 29మిమీ, అల్లూరి జిల్లా ముంచింగిపుట్టులో  24మిమీ, అన్నమయ్య జిల్లా గాలివీడులో 22మిమీ వర్షపాతం నమోదయిందన్నారు.