Janasena MLA Car Attack: జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి, స్పందించిన నేత ఏమన్నారంటే
Shankar Dukanam | 29 Jul 2024 11:47 PM (IST)
Attack On Polavaram MLA Chirri Balaraju Car | జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొందరు గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనం వెనుక వైపు అద్దాలు ధ్వంసమయ్యాయి.
జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి, స్పందించిన నేత ఏమన్నారంటే
Attack On MLA Chirri Balaraju Car: జీలుగుమిల్లి: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల సమీపంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఎమ్మెల్యే బాలరాజును లక్ష్యంగా చేసుకుని ఆయన వాహనంపై దాడికి పాల్పడ్డారు. అయితే దాడి జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి పోలవరం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారులో లేరని జీలుగుమిల్లి పోలీసులు తెలిపారు. జనసేన ఎమ్మెల్యే ఇంటి నుంచి కారు జీలుగుమిల్లి వైపు వెళ్తుండగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కియా కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో కారులో ముగ్గురు ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
క్షేమంగా ఉన్నాను, ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యేతన కారుపై జరిగిన దాడిపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. దాడి జరిగిన సమయంలో తాను వాహనంలో లేనని, నాయకులు, కార్యకర్తలు ఎవరూ దీనిపై ఆందోళన చెందకూడదున్నారు. బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు తన కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడ్డా, పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఎమ్మెల్యే కారు పై జరిగిన దాడి జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు.
ఆఫీసులో పబ్జీ ఆడుతున్న ఉద్యోగిని పట్టుకున్న ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆఫీసులో విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి మొబైల్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నట్లు గమనించారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే ఉన్నతాధికారులను ఆదేశించారు. కన్నాపూరం ITDA ఆఫీసుని ఎమ్మెల్యే తనిఖీ చేయగా.. ఆయన రాకతో అక్కడి ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎలాంటి సెక్యూరిటీ, సాధారణ వ్యక్తిలా, ముఖానికి మాస్కు ధరించి రావడంతో ఉద్యోగులు ఆయనను గుర్తుపట్టలేదు. D. Y. E. O సెక్షన్ O. S - సాయి కుమార్ విధుల్లో ఉండి దర్జాగా పబ్జీ ఆడటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటవి ఉద్యోగులు ప్రజలకు అవసరం లేదని, చర్యలకు అధికారులను ఆదేశించారు.