Nara Lokesh: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుతున్నానంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ వీరేంద్ర కుమార్ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో వీరేంద్ర కుమార్, అతని కుటుంబసభ్యులకు నేనున్నానంటూ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం వీరేంద్ర కుమార్ ను ఇంటికి చేర్చారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుద్దామన్న ఆశతో ఎంతో శ్రమకోర్చి గల్ఫ్ వెళ్లి.. ఏజెంట్ చేతిలో వీరేంద్ర కుమార్ మోసపోయారు. ప్రభుత్వం, నారా లోకేశ్ చొరవతో ఆయన క్షేమంగా ఇంటికి చేరాడు.
15 రోజులు దుర్భర జీవితం
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన వీరేంద్రను ఏజెంట్ ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. 16 నెలల క్రితం ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా వీరేంద్ర దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో మరో వ్యక్తికి వీరేంద్రను విక్రయించి హైదరాబాద్ ఏజెంట్ జారుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల మధ్య ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 15 రోజులు పాటు ఎడారి మధ్యలో, కనీసం తాగేందుకు కూడా నీరు లేక నానావస్థలు పడ్డాడు. తాను సౌదీలో పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి.. తన మిత్రుడికి పంపగా.. అతడు మంత్రి లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’(గతంలో ట్విటర్)లో పోస్ట్ చేశాడు. దీంతో స్పందించిన లోకేశ్.. వీరేంద్ర కుమార్ ను స్వదేశానికి రప్పించేందుకు సాయం చేశారు.
అక్కడున్న తెలుగు దేశం పార్టీ ఎన్నారై విభాగంతో మాట్లాడి వీరేంద్రను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 26న హైదరాబాద్ చేరుకున్న వీరేంద్ర.. సోమవారం తన స్వగ్రామానికి వెళ్లారు. మంత్రి లోకేశ్ చొరవతోనే తాను ఇంటికి క్షేమంగా చేరుకోగలిగానని వీరేంద్ర ఆనందం వ్యక్తం చేశాడు. ప్రాణాలతో తిరిగి వస్తానని అనుకోలేదని బాధితుడు వీరేంద్ర తెలిపారు.
వెంటనే స్పందించిన లోకేశ్
నకిలీ ఏజెంట్ ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి తనను సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పడేశారని వీరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను 15రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేశాడు. ఎండకు తట్టుకోలేక తనకు ముక్కులోనుంచి రక్తం కారుతోందని, టాయిలెట్ కూడా రావడం లేదంటూ కన్నీరుపెట్టుకున్నాడు. ఒంటెల మధ్య గుడారాల్లో బతకలేకపోతున్నానని, తాగాడానికి నీరు, తినడానికి తిండి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎలాగైన ఆ నరకం నుంచి కాపాడి స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో లోకేశ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని, స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగాన్ని మంత్రి అలర్ట్ చేశారు.
కువైట్ నుంచి ఇంటికొచ్చిన శివ
ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చొరవతో తెలుగు కార్మికుడు శివ కువైట్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. తెలుగు కార్మికుడు శివ కువైట్‌లో తను పడుతున్న కష్టాలపై కన్నీళ్లతో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై లోకేష్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో కువైట్ నుంచి శివ కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు.
దుర్గను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఒమన్‌లో చిక్కుకున్న మామిడి దుర్గ అనే మహిళకు సైతం మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. బాధితురాలిని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకున్నట్లు ప్రకటించారు. కేంద్రంతో మాట్లాడి దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల కిందట ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయానంటూ దుర్గ ట్విటర్లో వీడియో పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి, ఆమెకు భరోసా ఇచ్చారు.