Dwarapudi Road: మండపేట - ద్వారపూడి రోడ్డు పనుల వేగవంతానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు మినహా ఆటోలు, కార్లు, లారీలు, బస్సులు రాకపోకలపై దారి మళ్లించడానికి ఆంక్షలు విధించారు. ఈ మేరకు సోమవారం నుండి వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు రోడ్డు భవనాల శాఖ రామచంద్రపురం డివిజన్ అధికారి వై. వెంకటేశ్వర రావు తెలిపారు. ఆదివారం స్థానిక రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఈ సూర్య నారాయణ తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ద్వారపూడి వంతెన నుండి ఇప్పనపాడులోని అంబేద్కర్ విగ్రహం వరకు 2.6 కిలో మీటర్లు బీటీ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం నుండి తాపేశ్వరం శివారు అర్తమూరు మలుపు వరకు 2.6 సీసీ రోడ్డు అక్కడి నుండి పెద్ద కాల్వ వరకు 800 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.




రోడ్డు నిర్మాణ పనుల వల్ల డైవర్షన్..


ఈ పనుల కోసం రూ. 12.5 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు రోడ్డు భవనాల శాఖ రామచంద్రపురం డివిజన్ అధికారి వై. వెంటశ్వేర రావు వెల్లడించారు. రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలల పాటు జరుగుతాయని వెల్లడించారు. ఈ మేరకు వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. రావుల పాలెం సామర్ల కోట ఆర్టీసీ బస్సులను పెడపర్తి రామవరం అనపర్తి మీదుగా దారి మళ్లించారు. రూరల్ పోలీసుల సూచన మేరకు రోడ్డు డైవర్షన్ పై మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద, పెడపర్తి రేవు వద్ద, అనపర్తి ద్వారపూడి వంతెనల వద్ద, వేమగిరి వంతెన వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు.


3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..


రాజమండ్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు రాయవరం మండలం మాచవరం మీద నుండి సోమేశ్వరం అనపర్తి మీదుగా రాక పోకలు సాగించడానికి డైవర్షన్ ఇచ్చారు. ద్వారపూడి మండపేట రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద నుండి తాపేశ్వరం తూముల వరకు, అలాగే ఇప్పనపాడు శివ జ్యోతి రైస్ మిల్ వద్ద నుండి ద్వారపూడి వంతెన వరకు బీటీ రోడ్డు నిర్మించనున్నారు. అర్తమూరు తూముల వద్ద నుండి తాపేశ్వరం ఇప్పనపాడు గ్రామాలలో శివ జ్యోతి రైస్ మిల్ వరకు సిసి రోడ్డు నిర్మాణం చేయనున్నారు. మొత్తం ఆరు కిలోమీటర్ల రోడ్డుకు గాను రెండున్నర కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. సీసీ రోడ్డు నిర్మించిన తర్వాత వెంటనే వాహనాలు తిరిగితే రోడ్డు నాశనం అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఆంక్షలు పెట్టినట్లు ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. జనవరి నాటికి పనులు పూర్తవుతాయని అంత వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. మూడు నెలల పాటు ప్రజలు సహకరించాలని ఆర్ అండ్ బి డీఈ వెంకటేశ్వరరావు, జేఈ సూర్యనారాయణలు కోరారు. 


ఉభయ గోదావరి జిల్లాల నుంచి ద్వారపూడి కి వస్త్ర వ్యాపారులు..


ద్వారపూడి గ్రామం వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వారంలో మూడు రోజులు పాటు భారీగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనేక మంది వస్త్ర వ్యాపారులు తరలి వస్తుంటారు. గత కొన్ని రోజులుగా ద్వారపూడి మండపేట రోడ్డు ఈ రోడ్డు మార్గం చాలా దారుణ పరిస్థితికి మారింది. రోడ్డు పొడవునా భారీ గుంతలతో వాహన వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అనేక ప్రమాదాలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ రోడ్డు మార్గం అభివృద్ధికి నోచుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.