గ‌డ‌చిన అయిదు నెల‌లుగా పెద్ద‌పులి జ‌నావాసాల వైపు తిరుగుతూ మ‌రికొన్ని రోజులు అడ‌విబాట ప‌డుతూ అట‌వీశాఖ అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు అయితే తాగిస్తోంది.. అట‌వీమార్గంలోకి వెళ్లిన‌ట్లే వెళ్లి హ‌మ్మ‌య్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్న గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌నావాసాల మ‌ధ్య పాద‌ముద్ర‌ల‌తో క‌నిపిస్తూ అజ‌డి రేపుతోంది.. దీంతో ఉరుకులు ప‌రుగులు పెట్టి అప్ర‌మ‌త్తం చేస్తున్న అట‌వీశాఖ అధికారులు ప్ర‌జ‌ల నుంచి మాత్రం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. వీరు కావాల‌నే దీనితో కాల‌క్షేపంచేస్తున్నార‌ని కొంత మంది అంటుంటే అది జ‌నావాసాల వ‌ద్ద సునాయాశంగా దొరికే ఆవుల‌కోసం వ‌స్తుంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.. మొత్తం మీద గ‌డ‌చిన అయిదు నెల‌లుగా మాత్రం పెద్ద‌పులి తీవ్ర అల‌జ‌డి అయితే సృష్టిస్తోంది.  

Continues below advertisement

తాజాగా పోల‌వ‌రం జిల్లా నుంచి గోదావ‌రి దాటి తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన పెద్ద‌పులి రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌చ్చే కోరుకొండ మండ‌లంలోకి ప్ర‌వేశించింది. అక్క‌డి నుంచి పాండ‌వుల మెట్ట ప్రాంతంలో రెండురోజుల పాటు దాక్కున్న పెద్ద‌పులి స్థానిక రైతుల‌ను తీవ్ర భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. ప‌గ‌టి పూట కొండ‌ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవ‌డం, రాత్రి వేళ‌ల్లో కొండ దిగి స్థానికంగా ఉండే పంట‌పొలాల్లోకి చొర‌బ‌డి అక్క‌డ ఉన్న పిల్ల కాలువ‌ల్లో దాహం తీర్చుకోవ‌డం చేస్తుందంటున్నారు. పులికి ఏర్పాటు చేసిన ట్రాకింగ్ రేడియో కాల‌ర్ ద్వారా పులిక‌ద‌లిక‌ల‌ను గుర్తిస్తున్న అట‌వీశాఖ అధికారులు తాజాగా మున‌గాల కొండ‌పై ఉన్న‌ట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే మ‌ళ్లీ తాజాగా మ‌ళ్లీ పెద్ద‌పులి పోల‌వ‌రం జిల్లాలోకి ప్ర‌వేశించింద‌ని తెలుస్తోంది. దేవీప‌ట్నం మండ‌లం కొత్త‌వీధి, బూరుగుబంద గ్రామాల మ‌ధ్య ఉన్న కొండ‌పైన పెద్ద‌పులి సంచ‌రిస్తున్న‌ట్లు అట‌వీశాఖ అధికారులు గుర్తించారు.

అయిదు జిల్లాలు.. అయిదు నెల‌లు..

Continues below advertisement

గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో ఏలూరు జిల్లా బుట్టాయ‌గూడెం ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద‌పులి క‌ద‌లిక‌ల‌ను గుర్తించారు అట‌వీశాఖ అధికారులు.. ఏలూరుజిల్లాలో మూడు వారాల‌పాటు తీవ్ర అల‌జ‌డి రేపిన పెద్ద‌పులి పోల‌వ‌రం జిల్లాలోకి ప్ర‌వేశించింది. ఆత‌రువాత తూర్పుగోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన పెద్ద‌పులి రాజమండ్రి రూర‌ల్ ప్రాంతంలో తీవ్ర అల‌జ‌డే రేపింది. వ‌రుస‌గా రైతుల పొలాల్లోకి చొర‌బ‌డి ప‌శువుల‌పై దాడిచేసి చంపేసిన పెద్ద‌పులి అక్క‌డి నుంచి అప్ప‌టి అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ప‌రిధిలో ఉండే మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం రాయ‌వ‌రం మండ‌లం కూర్మాపురం ప్రాంతంలో పిబ్ర‌వ‌రి 6వ తేదీన రాత్రి 7 గంట‌ల ప్రాంతంలో ఎట్ట‌కేల‌కు అట‌వీశాఖ అధికారుల‌కు ప‌ట్టుబ‌డింది.

ఆ త‌రువాత విశాఖ‌ప‌ట్నం పెద్ద‌పుల‌లు సంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లించి అక్క‌డ చికిత్స అందించిన అధికారులు పిబ్ర‌వ‌రి 14న పాపికొండ‌ల నేష‌న‌ల్ పార్క్ ప‌రిధిలోని అడ‌విలో వ‌దిలిపెట్టారు. వ‌దిలిన‌ప్ప‌టి డ్రోన్ వీడియోల‌ను కూడా ఫారెస్ట్ అధికారులు విడుద‌ల చేశారు. అయితే కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే అల్లూరి సీతారామ‌రాజు జిల్లా ప‌రిధిలోకి ప్ర‌వేశించిన పెద్ద‌పులి అక్క‌డి నుంచి పోల‌వ‌రం జిల్లా దేవీప‌ట్నం ప‌రిస‌ర ప్రాంతాల్లో సంచ‌రించి ఆవుల‌ను చంపింది. అక్క‌డి నుంచి తూర్పుగోదావ‌రి జిల్లాలోని మ‌ల్ల‌వ‌రం ప్రాంతంలో అల‌జ‌డి రేపింది. అక్క‌డి నుంచి ఏలేరు రిజ‌ర్వాయ‌రు వ‌ద్ద గోదావ‌రిని ఈదుకుని కాకినాడ జిల్లాలోకి ప్ర‌వేశించింది. జ‌గ్గంపేట‌, ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గాల్లోని అట‌వీప్రాంతానికి ఆనుకునిఉన్న జ‌నావాసాల వైపు వ‌చ్చి తీవ్ర భ‌య బ్రాంతుల‌ను సృష్టించింది. మ‌ళ్లీ పోల‌వ‌రం జిల్లా వైపుగా వెళ్లి అడ‌విబాట ప‌ట్టింది.. తాజాగా పోల‌వ‌రం జిల్లా నుంచి తూర్పుగోదావ‌రి జిల్లాలోకి, అక్క‌డి నుంచి మ‌ళ్లీ పోల‌వ‌రం జిల్లా ప‌రిధిలోని దేవీప‌ట్నం వైపుగా వెళ్లిన‌ట్లు దానికి అమ‌ర్చిన శాటిలైట్ రేడియో కాల‌ర్ ద్వారా గుర్తించారు అధికారులు.

మ‌ళ్లీ ప్ర‌త్యేక బృందాల‌తో ప్ర‌య‌త్నాలు..

పెద్ద‌పులిని ప‌ట్టుకునేందుకు పూణే నుంచి వచ్చిన ప్ర‌త్యేక బృందాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయ‌ని అట‌వీశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అట‌వీశాఖ‌కు చెందిన హ‌నుమాన్ బృందాలు, అట‌వీశాఖ సిబ్బంది నిరంత‌రం పెద్ద‌పులిని బంధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటున్నారు. అయితే ట్రాంక్‌లైజింగ్ రెస్క్యూ టీమ్ పూణే నుంచి వ‌చ్చినా పెద్ద‌పులిని మాటు వేసి దానిని ట్రాంక్‌లైజ్ చేయాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసికొడుతున్నాయి. మొత్తం మీద చిక్క‌క‌, దొర‌క‌క పెద్దపులి ముప్పు తిప్ప‌లు పెడుతుండ‌గా ప్ర‌జ‌లు, రైతులు మాత్రం అట‌వీశాఖ అధికారుల‌పై తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.