దేవీపట్నం: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని నేలకోట కొండపై పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రస్తుతం రామదుర్గం కొండపైన మకాం వేసిన ఈ పులిని స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే, మనుషులను చూసినప్పటికీ ఆ పెద్దపులి ఎటువంటి దాడి చేయకుండా వెనుకడుగు వేయడంతో ఎలాంటి దాడులు జరగలేదు. పాపికొండల అభయారణ్యం నుండి బయటకు వచ్చిన ఈ పులి గత 40 రోజులుగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖాళీ చేసిన గ్రామాల సమీపానికి చేరుకుంది.
గిరిజన గ్రామాల్లో హై అలర్ట్నాలుగు రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం, పెద్ద కొండేపూడి పరిసర గ్రామాల్లోకి ప్రవేశించిన ఈ పెద్ద పులి అక్కడ కలకలం సృష్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి పోలవరం జిల్లాలోని నేలకోట అటవీ ప్రాంతానికి చేరుకోవడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పోచమ్మగండి, శరభవరం వంటి గిరిజన గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. స్థానికులు అనవసరంగా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే గుంపులుగా మాత్రమే సంచరించాలని ప్రజలకు అధికారులు సూచించారు.
పెద్దపులికి అమర్చిన రేడియో కాలర్ నుండి వస్తున్న సిగ్నల్స్ ఆధారంగా అటవీశాఖ ప్రత్యేక బృందాలు దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం కొండపై తిష్ట వేసిన ఈ పులికి సరైన ఆహారం దొరకడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. పులి సంచారం కారణంగా పోలవరం నిర్వాసిత ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. తమ పశువులపై ఎక్కడ పంజా విసురుతుందోనని గిరిజనులు, స్థానిక పశువుల కాపర్లు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
