Godavari Floods :  తుపానులు .. వరదలు వచ్చినప్పుడు అందరికీ ఎక్కువగా వినిపించే పదం ప్రమాదహెచ్చరికలు. ఒకటో నెంబర్ నుంచి ప్రమాద హెచ్చరికలు ప్రారంభమవుతాయి. ఎంత నెంబర్ పెరిగితే అంత తీవ్ర ఉందని జనం అనుకుంటూ ఉంటారు. కానీ ప్రమాద హెచ్చరికల వెనుక స్పష్టమైన ఉద్దేశం ఉంటుంది. ప్రస్తుతం గోదావరి వరదల కారణంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రమాద హెచ్చరికలు గోదావరి మొత్తం ఒకేలా ఉండవు. ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.


భద్రాచలంలో 43 అడుగులకు వరద చేరితో  మొదటి ప్రమాద హెచ్చరిక - 53 దాటితే రెడ్ అలర్ట్  


భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు  చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులను వరద తాకిడి తాకితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అదే 53 అడుగుల దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు. ప్రస్తుతం భద్రాచలంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 


కాటన్ బ్యారేజీ వద్ద 11.75 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక - 17.75 అడుగుకు చేరితే రెడ్ అలర్ట్ 


అదే  ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక విడుదలవుతుంది. నీటిమట్టం 13.75 అడుగులను దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. వరద ప్రవాహం 17.75 అడుగులను చేరితే మూడో ప్రమాద హెచ్చరిక వస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే సరికి  ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతారు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటుంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే సమయానికి 17లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది.  


ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తే పలు రకాల జాగ్రత్తలు, ఆంక్షలు


మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరగానే నదిలో బోటు ప్రయాణాలు సహా వివిధ ఆంక్షలు అమలులోకి వస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. లంకవాసుల రాకపోకలకు కూడా అవకాశం లేదు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వస్తే అనేక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది కలిసి ఏటిగట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. గట్లు బలహీనంగా ఉన్నాయని భావిస్తే ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాట్లు చేసారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి ఇక డేంజర్ జోన్‌లోకి చేరినట్లే.  రభుత్వ యంత్రాంగమంతా వరద నిర్వహణలోకి వెళుతుంది. ముఖ్యమైన శాఖల సిబ్బందికి సెలవులు కూడా రద్దవుతాయి. అన్ని వేళలా ఇరిగేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.