బాబాయిని చంపిన వారిని కాపాడడంలో ఏపీ సీఎం జగన్ బిజీగా ఉన్నాడని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ జీవితాల్లో జగన్ ని క్షమిస్తే... మళ్లీ పుట్టగతులు ఉండవు. ఈ స్థాయి కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వంటి వారు స్పందించాలి అని రైతులతో చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను, మొల‌కెత్తిన‌ వరి ధాన్యాలను  ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రైతులు వరిని ఆరబెట్టిన ప్రదేశం వద్దకు వచ్చి రైతులతో  చంద్రబాబు మాట్లాడారు. రైతులు చంద్రబాబుకు తమ సమస్యలు వివరిస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు పొలాలు వేసుకొని పూర్తిగా నష్టపోయామని చంద్రబాబు వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


దెబ్బతిన్న పంటను ఏం చేస్తాడో ఈ సిఎం చెప్పాలి.. చంద్రబాబు


అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటను ఈ ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఒక్క గోదావరి జిల్లాల్లో 40 నుంచి 50 శాతం పంట ఇప్పటికీ పొలాలు, కళ్లాల్లో ఉండిపోయిందని అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఏం చేస్తాడో ఈ సీఎం జగన్ చెప్పాలన్నారు. గతంలో పంటలకు ప్రభుత్వం  ఇన్సూరెన్స్ చేసేదని, రాష్ట్ర ప్రభుత్వం, రైతు, కేంద్రం కలిసి ఇన్సూరెన్స్ కట్టేవారన్నారు.
ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్  తీసేశారని, నాడు అసెంబ్లీలో ఇలాగే ఇన్సూరెన్స్  కట్టకుండా కట్టాను అని చెప్పాడన్నారు. నాడు అసెంబ్లీలో పోడియం వద్ద కూర్చుని నిరసన చేస్తే అప్పుడు రాత్రికి రాత్రి డబ్బు కట్టాడని గుర్తు చేశారు. ఇన్సూరెన్స్  కట్టి ఉంటే వారికి నేడు కాస్త భరోసా లభించేదని,- ఒక ఎకరానికి 50 నుంచి 60 బస్తాల ధాన్యం వస్తుండగా కౌలు రైతు 30 బస్తాలు కౌలుగా చెల్లిస్తున్నాడన్నారు. ఖరీఫ్ లోను దెబ్బతిన్నారు, ఇప్పుడు అకాల వర్షాలకుమళ్లీ దెబ్బతిన్నారని చంద్రబాబు అన్నారు.


ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఏపీ.. 
దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతుల్లో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందని, కౌలు రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్సీ, బీసీలే ఉండడం బాధాకరమన్నారు చంద్రబాబు. ఏపీ సీఎం జగన్ రైతులను పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో వరి సాగు చేసిన రైతు ఉరేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.


సకాలంలో గోని సంచులు ఇస్తే ఇబ్బందులు తప్పేవి... 
రబీ పంట కోసం ఏప్రిల్ 1నుంచి ధాన్యం సేకరణకు గోనెసంచులు పంపాలి...కానీ పంపలేదు, పంపిన గోనె సంచులు కూడా నాణ్యత లేదు. దీంతో తరుగుపోతుంది. సకాలంలో గోనె సంచులు ప్రభుత్వం ఇస్తే ఈ బాధలు రైతులకు తప్పేవన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ 4.75 లక్షల మెట్రిక్ టన్నులే ఇప్పటి వరకు సేకరించారు. పంట అమ్మిన రైతు నుంచి ఎదురు వసూలు చేస్తున్నారు. వివిధ కొర్రీలు పెట్టి ఒక్కొ రైతుకు రూ. 300 నుంచి 600 కోత కోస్తున్నారని ఆరోపించారు. దెబ్బతిన్న పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో, ధాన్యం ఎప్పుడు కొంటారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 
తన ప్రభుత్వ హాయంలో నాడు ధాన్యం సేకరణలో చిన్న లోపం కూడా ఉండేది కాదాని, సేకరణ విధానం సరళంగా ఉండేదన్నారు. ఇప్పుడు ధాన్యం తీసుకువెళ్లిన మిల్లు దగ్గర కనీసం ధాన్యం దించుకోవడం లేదు. వేరే మిల్లు దగ్గరకు వెళ్లడానికి లేదన్నారు.


నాడు తుఫాను వస్తే పది రోజులు ఇక్కడే ఉన్నాను... 
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాను వస్తే సీఎంగా రాజమండ్రిలో 10 రోజులు ఉండి సాయం అందిన తరువాతనే మళ్లీ వెనక్కి వెళ్లానని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ రోజు రైతులు సంక్షోభంలో పడ్డారు. మరి తాడేపల్లి కొంపనుంచి జగన్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.  ఎందుకు ఇంట్లోనే కూర్చుని కులుకుతున్నాడు. కరోనా సమయంలో కూడా హాలిడే తీసుకోకుండా కష్టపడి పనిచేసింది రైతన్న అలాంటి రైతుకు మీరు ఉరితాడు వేస్తారా అంటూ మండిపడ్డారు.


బటన్ నొక్కుతాను అంటున్న జగన్...! 
సీఎం జగన్ కు బటన్ నొక్కడం కాదు గాని బొక్కడమే తెలుసని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు రైతుల దగ్గరకు రావడం లేదన్నారు. ఈ మంత్రి ఎందుకు ఉన్నాడు. వెళ్లి కాళ్లు మొక్కడానికా.... అంటూ స్థానిక మంత్రి పై సెటైర్లు వేశారు. రైతులను పొట్టన పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదని, జగన్ అహంభావం వల్ల రైతు చితికిపోయాడు. ఈ విషయంపై జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో నిర్థిష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


ఫేక్ మాటలు కాదు. పంట పొలాల్లో ఉన్నపంటకు ఏం ఇస్తావో చెప్పు ? 
పట్టిన ధాన్యం అకాల వర్షాలకు దెబ్బతింది.... దాన్ని ఎంతకు కొంటావో చెప్పు ముందు. నేను గోదావరి జిల్లాకు వస్తున్నాను అంటే ప్రభుత్వంలో సెక్రటరీ స్టేట్మెంట్ ఇస్తాడా. ముఖ్యమంత్రి నోరు పడిపోయిందా.... సమాధానం చెప్పడానికి తెలివి లేదా అంటూ చంద్రబాబు విరుచుకు పడ్డారు. రోమ్ తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు నేడు జగన్ తీరు ఉంది అని ఎద్దేవా చేశారు. జవాబు దారీ తనం, బాధ్యత లేని ప్రభుత్వం దేశానికి అరిష్టం.టేకుమూడి వెంకన్న అనే వ్యక్తి ఇక్కడ రైతుల కోసం మీటింగ్ పెడితే అతనిపై పోలీసులు దాడి చేశారు. పోలీసులూ గుర్తుపెట్టుకోవాలి. చట్టాన్ని అతిక్రమించిన ఏ ఒక్క పోలీసులను వదిలేది లేదని హెచ్చరించారు. పోలీసులకు ధైర్యం ఉంటే బాబాయిని చంపిన ముఖ్యమంత్రి జగన్ ని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. వెంకన్నను వెంటనే విడుదల చేయాలి. ఎందుకు పోలీసులు అతన్ని కొట్టారు. రైతుల తరుపున పోరాడకూడదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.