Weight Disappears From Chandrababu Health Bulletin:


ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు బీపీ సాధారణంగానే ఉండగా, ఫిజికల్ యాక్టివిటీ బాగున్నట్లు రాజమండ్రి జైలు అధికారులు తెలిపారు. నిమిషానికి 12 సార్లు శ్వాస తీసుకుంటుండగా, నిమిషానికి 62 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు (Chandrababu Heart Rate) హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. ఊపిరితిత్తులకు ఏ సమస్యా లేదని చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారని డాక్టర్ల టీమ్ జైలు అధికారులకు వివరించారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వైద్య అధికారులు, రాజమండ్రి జీజీహెచ్ డాక్టర్స్ టీమ్ చంద్రబాబును సోమవారం పరీక్షించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు గత ఏడు వారాల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.


అయితే తాజా హెల్త్ బులెటిన్ లోనూ చంద్రబాబు బరువు వివరాలను వెల్లడించలేదు. చంద్రబాబు బరువు తగ్గుతున్నారని, జైలులో ఆయన ఆరోగ్యం సరిగా లేదని ఆయన కుటుంబసభ్యులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. జైలు వాతావరణంలో వేడికి చంద్రబాబుకు దద్దుర్లతో ఎలర్జీ సమస్య రావడం తెలిసిందే. దీనిపై కుటుంబసభ్యులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. జైలులో ఏసీ ఏర్పాటుకు న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తరువాత స్నేహ బ్లాక్ లో చంద్రబాబు కోసం ఏసీ వసతి కల్పించారు. నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యులు మరోసారి ములాఖత్ అయ్యారు.


జైలు అధికారులు గత నాలుగైదు రోజులుగా చంద్రబాబు బరువు ఎంత ఉన్నారనే వివరాలను పేర్కొనడం లేదు. ఆదివారం రాత్రి ఇచ్చిన హెల్త్ బులెటిన్ లో ఇలాగే జరిగింది. సోమవారం (అక్టోబర్ 23వ తేదీ) నాడు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటిన్ లోనూ టీడీపీ అధినేత బరువుకు సంబంధించి వివరాలు వెల్లడించలేదు. నిన్న రెస్పిరేటరీ రేటు తెలపని అధికారులు తాజాగా మాత్రం చంద్రబాబు శ్వాసక్రియ రేటు సాధారణంగా ఉందని పేర్కొనన్నారు. చంద్రబాబు రెస్పిరేటరీ రేటు నిమిషానికి 12 సార్లుగా ఉందని తెలిపారు.




చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్


రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబుతో దసరా పండుగ నాడు ములాఖత్‌ అయ్యారు. వారితో పాటు పార్టీ నేత మంతెన సత్యనారాయణరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సాధించ‌బోయే విజ‌యానికి సంకేతం విజ‌య‌ద‌శ‌మి సంబ‌రమంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు. చెడుకి పోయేకాలం ద‌గ్గర ప‌డ‌టం ద‌స‌రా సందేశమన్న ఆయన, ప్రజ‌ల్ని అష్టక‌ష్టాలు పెడుతోన్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే పంతంగా అంతా కలిసి పోరాడ‌దామని పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని, అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లి విరియాలని ఆకాంక్షించారు.