Sri Vadapalli Venkateswara Sawmi Temple | కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభ‌వోపేతంగా ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఖండవల్లి రాజేశ్వర పరప్రసాదచార్యులు నేతృత్వంలో వైఖన ఆగమన శాస్త్రోక్తంగా పరమ పవిత్రమైన శ్రావణ శుద్ధ, దశమి, ఏకాదశి ద్వాదశి మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలు, ఋత్వికులు, వేద పండితులు దీక్షాధారణ చేసి, శాస్త్రోక్తంగా వేడుకలను ప్రారంభించ‌గా నేటితో ముగుస్తున్నాయి. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర రావు పర్యవేక్షణలో ఆయా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

పవిత్రోత్సవాలు ప్రాముఖ్య‌త ఇదే..

ఏడు వారాల వెంక‌న్న‌గా ప్ర‌సిద్ధి చెందిన వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలోని పవిత్రతను పునరుద్ధరించడమే కాక, భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, దైవానుగ్రహాన్ని ప్రసాదించేందుకు ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తుండ‌డం సంప్ర‌దాయం కాగా ఒక పవిత్రమైన వార్షిక ఉత్సవంగా వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌ర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని, స్వామివారి మూల‌విరాట్‌ను, పరిసరాలను శుద్ధి చేయడానికి, పవిత్రం చేయడానికి నిర్వహిస్తున్నారు..

ఆధ్యాత్మికం.. మూడు రోజుల ఉత్స‌వం.. 

వాడపల్లి ఆలయంలో పవిత్రోత్సవాల సంద‌ర్భంగా ఆలయం, స్వామి విగ్రహం శుద్ధి చేయడంతోపాటు ఈ కార్యక్రమంలో అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం, గోదావరి జలాలతో అభిషేకం వంటి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు.. ఈ శుద్ధి కార్యక్రమం ఆలయంలోని దైవిక శక్తిని పునరుద్ధరిస్తుందని, భక్తులకు సానుకూల శక్తిని అందిస్తుందని భక్తుల ప్ర‌గాఢ విశ్వాసం.. దీంతోపాటు పవిత్రోత్సవాల సమయంలో జరిగే వేద పారాయణాలు, అష్టోత్తర పూజలు మరియు నిత్య కల్యాణాలు భక్తులకు మానసిక శాంతిని, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తాయి. ఈ ఉత్సవాలు భక్తులను దైవ సాన్నిధ్యంతో ఆకర్షిస్తాయి. వారి కోరికలను నెరవేర్చేందుకు స్వామి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.

ఇక వాడపల్లి ఆలయం ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామిని దర్శించడం ద్వారా కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ప్రసిద్ధి చెంద‌గా పవిత్రోత్సవాలు ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి, ఎందుకంటే ఈ సమయంలో జరిగే పూజలు శని దోష నివారణకు మరియు భక్తుల కోరికల నెరవేర్పుకు సహాయపడతాయని భావించ‌డంతో ఈస‌మ‌యంలో ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతున్నారు. పవిత్రోత్సవాల సమయంలో గోదావరి జలాలతో స్వామి విగ్రహానికి అభిషేకం చేయడం ఒక ప్రత్యేక ఆచారం కాగా ఈ జలాలు పవిత్రమైనవిగా  ఈ అభిషేకం ద్వారా స్వామి యొక్క దైవిక శక్తి మరింత ప్రకాశిస్తుందని నమ్ముతారు.

నేటితో పవిత్రోత్సవాల ముగింపు..

రెండు రోజుల పాటు వైభ‌వోపేతంగా నిర్వ‌హించిన వాడ‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప‌విత్రోత్స‌వాలు బుధ‌వారం రాత్రితో ముగియ‌నున్నాయి.. సోమవారం ఉదయం ఋత్వికులు దీక్షా ధారణతో ఉత్సవాలు ప్రారంభమై, రెండవ రోజు అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మూడోరోజు ప్ర‌త్యేక పూజ‌లు, అభిషేకాలుతో వైభ‌వోపేతంగా జ‌రుగ‌నుండ‌గా ఈ ఉత్సవాలు ఆలయంలో భక్తిమయ వాతావరణాన్ని సృష్టిస్తూ, భక్తులను ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద‌ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో  ఏటా జరిగే పవిత్రోత్సవాలు ఆలయ శుద్ధి, భక్తుల ఆధ్యాత్మిక శాంతి తోపాటు స్వామి యొక్క దైవిక అనుగ్రహాన్ని పొందేందుకు భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు..