సత్యదేవుని కళ్యాణం.. కమనీయ వేడుక..
నేడు సత్యదేవుడు అనంత లక్ష్మీ అమ్మవార్ల దివ్యకళ్యాణం..
నేడు సత్యదేవుడు అనంత లక్ష్మీ అమ్మవార్ల దివ్యకళ్యాణం..
పంపానదీ తీరంలో రత్నగిరి కొండపై వెలసిన కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరుగాంచిన సత్యదేవుని కళ్యాణ మహోత్సవ వేళ ఆ అపురూప ఘట్టాన్ని ఒక్కసారైనా వీక్షించాలని కోరుకునే భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే అన్నవరం దేవస్థానంలోని స్వామి సమక్షంలో వివాహాలు చేసుకున్నా, నవదంపతులు ఇక్కడ సత్యనారాయణస్వామి వత్రం ఆచరించినా వారి వైవాహిక బంధంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని ప్రతీతి. కాగా ప్రతీ ఏటా వైశాఖ మాసంలో అనంతలక్ష్మీ సత్యవతి సమేత వీరవేంకట సత్యనారాయణస్వామి కళ్యాణ వైభవం కన్నులారా చూసి తరించాల్సిందే.
నేడే కళ్యాణ మహోత్సవ ఘట్టం..
కాకినాడ జిల్లాలోని అన్నవరంలో సత్యదేవునికి ప్రతీ ఏటా వైశాఖ శుద్ద దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. దశమినాడు అంకురార్పన, ఏకాదశినాడు కళ్యాణం, ద్వాదశిరోజు మహానారాయణహోమం, త్రయోదశినాడు కళ్యాణ సదస్యం, చతుర్ధశిరోజు వనవిహారయాత్ర, పౌర్ణమిన శ్రీచక్రస్నానం, బహుళపౌడ్యమిన పుష్పయాగం ఇలా ఉత్సవాలు జరుగుతాయి.. ఇందులో కళ్యాణ మహోత్సవ ఘట్టం కన్నులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు రత్నగిరికి తరలివస్తారు. సత్యదేవుడు అనంత లక్ష్మీ అమ్మవార్ల దివ్యకళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానుంది. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతసేవతో ప్రారంభమయ్యే ఘట్టం 8 గంటలకు చతుర్వేది పారాయణం, కంకణధారణ, దీక్షావస్త్రధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి మంగళసూత్రాలు, చుట్లు, స్వామివారికి స్వర్ణ యజ్ఞోపవీతం గ్రామంలోని విశ్వబ్రాహ్మణుని వద్ద నుంచి తీసుకురావడం, రాత్రి 7 గంటలకు స్వామివారిని గరుడ వాహనంపై అమ్మవారిని గజవాహనంపై సీతారాములను వెండి పల్లకీలో కొండ దిగువన ఊరేగింపు అన్నీ వేడుకగా నిర్వహించనున్నారు. ఇక రాత్రి 9.30 గంటలకు రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ వేదిక వద్ద కళ్యాణఘట్టం ప్రారంభమవుతుంది. ఈనేపథ్యంలో వేలాది మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం పంపిణీ కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
సీతారాములవారే పెండ్లి పెద్దలు..
సత్యదేవుడు, అమ్మవార్ల కళ్యాణమహోత్సవానికి సీతారాముల వారే పెండ్లి పెద్దలుగా వ్యవహరిస్తుంటారు. ముందుగా క్షేత్రపాలకులు సీతారాములవారిని పల్లకిలో బాజాభజంత్రీలు నడుమ రామాలయం నుంచి స్వామివారి కళ్యాణ మండపానికి తీసుకెళ్లి సీతారాముల సమక్షంలో సత్యదేవుని కళ్యాణ వేడుకను జరిపిస్తారు.
నిత్య కళ్యాణం పచ్చతోరణం..
సత్యదేవుడు కొలువై ఉన్న అన్నవరంలో స్వామి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే వారి జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని, ఆ వేడుక కమనీయమని భక్తులు భావిస్తుంటారు.. ఈనేపథ్యంలోనే స్వామి సన్నిధిలో సుమారు 65 ఏళ్ల క్రితం రత్నగిరిలో నిత్యకళ్యాణం ప్రారంభించారు. 126 ఏళ్ల ప్రాసస్థ్యం కలిగిన దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు నిత్యకళ్యాణం జరిపించాలని 1956లో ప్రారంభించారు. ప్రతీ ఏటా ఇక్కడ వేలాది జంటలు కళ్యాణం జరుపుకుంటున్నారు..
ఇదీ పురాణ ప్రాశస్త్యం..
అన్నవర క్షేత్ర మాహాత్మ్యాన్ని వెల్లడించే ఎన్నో గాధలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణ కోసం వెళుతూ మార్గమధ్యంలో రత్నాకరుడనే భక్తుడిని ఆనుగ్రహించాడని, తనకు కొండ రూపాన్ని ఇచ్చి, తనపై సదా ఆవాసం ఉండమని రత్నాకరుడు శ్రీరాముణ్ని వేడుకున్నాడని పురాణ గాథలు చెబుతున్నాయి. కలియుగంలో భక్తుల్ని ఉద్దరించడానికి త్రిమూర్తుల ఏకీకృత రూపంలో సత్యనారాయణుడిగా తాను అవతరించి రత్నాకరుడి ఆభీష్టాన్ని నెరవేరుస్తానని శ్రీరాముడు పేర్కొనగా భక్తుడి విన్నపాన్ని అనుసరించి సత్యవాక్ పరిపాలకుడైన శ్రీరాముడే సత్యనారాయణుడిగా రత్న గిరిపై వెలశాడని ప్రతీతి.