భీమవరం: తల్లికి అనారోగ్యం కారణంగా స్వగ్రామంలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్న యువతి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయ్యారు. కుటుంబంలో సంపాదించే ఒక్కరు ఆమెనే కావడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన యువతి కొత్తపల్లి అనంతవాణి(32) హత్యకు గురైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనంతవాణి, తన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో గత ఏడాది స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఆమె తండ్రి దివ్యాంగుడు కాగా, తల్లి అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. అప్పటినుంచి ఆమె వర్క్‌ఫ్రం హోం చేస్తూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యామ్‌బాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహమై, ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే, ప్రియుడు శ్యామ్‌బాబుకు గతంలోనే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆలస్యంగా తెలుసుకుంది. తాను మోసపోయానని గ్రహించి, అప్పటినుంచి శ్యాం బాబును పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించారు.
దీంతో అనంతవాణిపై తీవ్ర పగ పెంచుకున్న శ్యామ్‌బాబు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అనంతవాణి నిద్రలేచి తలుపు తీయగా శ్యామ్‌బాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తిపోట్లతో తీవ్రరక్తస్రావం అయిన అనంతవాణిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలోనే చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం తరువాత అనంతవాణి మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఏఎస్సై వైవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కుటుంబానికి ఏకైక ఆధారం ఆమె..అనంతవాణి ఆ కుటుంబానికి ఏకైక ఆర్థిక ఆధారంగా నిలిచారు. దీంతో ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతోనే తల్లిదండ్రులను పోషిస్తున్నారు. బ్యాంకు లోన్ తీసుకుని కుటుంబం కోసం ఇల్లు కట్టిందని స్థానికులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకే ఆమె హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారు. కుమార్తెపై దాడి చేసి చంపుతున్నా అడ్డుకునే పరిస్థితులో లేమని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని స్థానికులు చెప్పుకొచ్చారు.
