- తాళ్లరేవు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... 
- ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెలర్ బస్సు..
- ఏడుగురు మహిళలు దుర్మరణం.. 
వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద మహిళలు... తాళ్లరేవు మండల పరిధిలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో దినసరి కులీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారే.. రోజు లానే పని ముగించుకుని తిరిగి ఆటోలో వస్తుంటే మృత్యువు బస్సు రూపంలో కాటేసింది. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో 11 మంది మహిళలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.  యానాం - కాకినాడ బైపాస్ రోడ్డులో తాళ్లరేవు వద్ద అత్యంత వేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల్లో ఆరుగురు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారంతా తీవ్ర గాయాలతో బయట పడ్డారు.


భీతావహంగా మారిన బైపాస్ రోడ్డు... 
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేసేందుకు మహిళలలు వెళ్తున్న ఆటో ను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో యానాం - కాకినాడ రోడ్డు నెత్తురోడింది. ప్రమాద ఘటన వద్ద రోడ్డుపై రక్త మోడుతూ చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాల తో ఆ ప్రాంతం అంతా భీతావహంగా మారింది. ఒకేచోట ఆరు మృతదేహాలు తీవ్ర గాయాలతో రక్తంతో నిండి పోవడంతో భయానక పరిస్థితి కనిపించింది. 


మృతులంతా యానాంకు చెందిన వారే... 
యానాం - కాకినాడ బైపాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా యానాం కు చెందిన వారిగా గుర్తించారు.  వీరంతా రోజూ తాళ్ల రేవు లో రొయ్యల ప్రాసెస్సింగ్ ఫ్యాక్టరీ లో రోజు వారి కూలీలుగా పనిచేస్తున్నారు. మృతులు యానానికి చెందిన శేషేట్టి వెంకటలక్ష్మి (41), కర్రి పార్వతి (41), నిమ్మకాయల లక్ష్మి (54), కల్లి పద్మ(38), చింతపల్లి జ్యోతి (38), బొక్కా అనంతలక్ష్మి (47) ప్రమాదంలో మృతి చెందారు. గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించగా మరో మహిళ బి. సత్యవతి (35)  మృతి చెందింది.  గాయపడిన వారిని యానం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 
బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోగా బస్ ఢీకొన్న సమయంలో ఆటోలో 11 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలిని మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ముమ్మిడివరం, యానాం  ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు.


తిరుమలలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మహిళా భక్తుల మృతితో విషాదం 
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 24వ మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, మరో ఆరు మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది.  రోడ్డు ప్రమాదం జరగడంతో ఘాట్ రోడ్డులో కొంత సమయం  ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. విజిలెన్స్, పోలీసులు కొంతసమయానికి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రమాదానికి గురైన భక్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని సమాచారం.