DR BR Ambedkar Konaseema District News : అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో దారుణ జరిగింది. ఓ వర్గానికి చెందిన ముగ్గురు యువకులపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటన మండపేటలో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎనిమిది మంది నిందితులను గుర్తించి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
సినిమాహాలు పార్కింగ్‌లో మొదలైన గొడవ..
మండపేట పట్టణానికి చెందిన మోహన్ కిరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ థియేటర్‌లో మాట్నీషో సినిమాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కిరణ్ సోదరి పార్కింగ్ స్థలంలో స్టాండ్ వేసి ఉన్న టూవీలర్‌కు ఆనుకొని కూర్చున్నప్పుడు అది వెనక్కి పడిపోయింది. దీన్ని నిలబెట్టి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మోటారు సైకిల్ కింద పడేసి వెళ్లి దర్జాగా వెళ్లి సినిమా చూస్తారా అంటూ బైక్ యజమాని వచ్చి థియేటర్‌లో గొడవ పెట్టుకున్నాడు. బూతులు తిడుతూ హాల్‌లో రచ్చ చేశారు. వివాదం ముదురుతుండడంతో కిరణ్ స్నేహితులు చంటి, చంద్రశేఖర్ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆవేశంతో ఉన్న బైక్ యజమాని ఆయన ఫ్రెండ్స్ చేయి చేసుకున్నారు.
కట్టేసి తమపై 40 మంది దాడికి తెగబడ్డారని కిరణ్ ఆరోపిస్తున్నారు. ప్రాణ భయంతో పారిపోగా స్నేహితులైన చంటి, చంద్రశేఖర్ సహాయంతో పట్టుకున్నారని తెలిపారు. చేతుల కట్టేసి దగ్గర్‌లోని ఓ గుడి స్తంభానికి కట్టేశారని పోలీసుల వద్ద వాపోయారు.
అట్రాసిటీ కేసులు నమోదు..
మండపేటలో ముగ్గురు యువకులపై దాడికి పాల్పడి ఘటనలో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఎమ్మార్పీఎస్ నాయకులు, మాల మహానాడు సంఘ నాయకులు రోడ్డుపైకి వచ్చిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసన బాట పట్టారు. తాము ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను విడిపించే వరకు వారు దిక్కులేని దుస్థితిలో ఉన్నారని, నిందితులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసులు నమోదు చేసి హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఘటనా స్థలానికి మండపేట డీఎస్పీ హుటాహుటీన చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆందోళనకారులతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు నిరసన బాట వీడేది లేదంటూ రోడ్డుపైనే కూర్చొన్న వారితో మాట్లాడారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన 8 మందిని గుర్తించామన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు కూడా వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.