సంచలన వ్యాఖ్యలు చేస్తూ రెండు రోజులుగా ప్రధానంగా వార్తల్లో నిలుస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు నేడు (మార్చి 27) కూడా ఓ బాంబు పేల్చారు. తాను గెలవడానికి కారణం దొంగ ఓట్లే అని ఒప్పుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈ నెల 24న వైఎస్ఆర్ సీపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజోలు ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాదరావు ఆ సమ్మేళనంలో మాట్లాడుతూ.. పూర్వం నుంచి తమ గ్రామం చింతలమోరికి ఓ బ్యాచ్ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారని చెప్పారు. ఆ ఓట్లతో తన విజయానికి వారు సహకరించేవారని బహిరంగంగా చెప్పారు. 15 నుంచి 20 మంది వచ్చి, ఒక్కొక్కరూ 5 నుంచి 10కి పైగా ఓట్లు వేసేవారని ఆయన చెప్పడం విస్మయం కలిగించింది. దీంతో తనకు 800 పైనే మెజారిటీ వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావుకు 50,053 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఉన్న బొంతు రాజేశ్వరరావుకు 49,239 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావుకు 44,592 ఓట్లు వచ్చాయి. దీంతో రాపాక వరప్రసాదరావు 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన గెలుపునకు దొంగ ఓట్లే కారణం అని చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బొంతు రాజేశ్వరరావు స్పందన
రాపాక వరప్రసాదరావు దొంగ ఓట్లతో గెలిచారని తాను అప్పుడే చెప్పానని ఆయన చేతిలో ఓడిపోయిన నేత బొంతు రాజేశ్వరరావు స్పందించారు. అదే విషయం కోర్టుకు కూడా చెప్పానని అన్నారు. కానీ, ఇప్పుడు తానే స్వయంగా దొంగ ఓట్ల వల్లే తాను గెలిచినట్లుగా రాపాక వరప్రసాదరావు గెలిచినట్లు ఒప్పుకున్నారని అన్నారు. ప్రజలు కూడా ఈ విషయాలను గ్రహించి సంఘానికి మంచి చేసిన వారికే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
జనసేనలోకి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బొంతు
రాజోలులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేత బొంతు రాజేశ్వరరావు గతేడాది డిసెంబరులో జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనలో చేరిన అనంతరం వైసీపీపై బొంతు రాజేశ్వరరావు విమర్శలు చేశారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, పార్టీ కోసం కష్టపడిన వారిని జైలుకు పంపుతున్నారని విమర్శించారు. దళిత యువకుడిని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చిందని, కానీ జగన్ అభిమాని కొడికత్తి శ్రీనుకు మాత్రం ఇప్పటివరకు బెయిల్ రాలేదని విమర్శించారు. కొడికత్తి శ్రీను ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నాడని, అతడికి న్యాయం చేయడానికి కూడా వైసీపీ ముందుకు రావడం లేదని ఆరోపించారు.