DIG Ravi Kiran: రాజమండ్రి జైలులో ఓ రిమాండ్‌ ఖైదీ మృతిచెందడం సంచలనంగా మారింది. డెంగ్యూతో రిమాండ్ ఖైదీ మృతి చెందడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిమాండ్ ఖైదీ మృతితో వారి అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. 


ఈ నేపథ్యంలో రిమాండ్‌ ఖైదీ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ వివరణ ఇచ్చారు.. గంజేటి వీర వెంకట సత్యనారాయణ అనే యువకుడు దోపిడి కేసులో ఈనెల 6వ తేదీన రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చినట్లు తెలిపారు. 7వ తేదీ ఉదయం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన జైలు వైద్యాధికారులు అతను జ్వరంతో బాధ పడుతున్నట్లు గుర్తించారని, వెంటనే అతన్ని వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య సహాయం నిమిత్తం ఈనెల 19వ తేదీన మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి 108 అంబులెన్సులో తీసుకెళ్లారు. 


ఖైదీ మృతిపై అధికారులకు సమాచారం
పరిస్థితి విషమించి ఈ నెల 20వ తేదీ తెల్లవారు జామున 05.28 గంటలకు సత్యనారాయణ కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు జైలు అధికారులకు సమాచారం అందిందని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ పేర్కొన్నారు. జైలుకు వచ్చేటప్పటికే సత్యనారాయణ జ్వరంతో బాధపడుతున్నాడు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్సకు చేరినప్పటి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో మృతిచెందినప్పటి వరకు సత్యనారాయణ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారని తెలిపారు.  రిమాండ్ ఖైదీ మరణించిన విషయాన్ని వెంటనే జైలు అధికారులు కేంద్ర మానవ హక్కుల కమీషన్ (NHRC), ఇతర అధికారులు, సంస్థలకు తెలియజేసినట్లు చెప్పారు.


వారికి ఆరోగ్య భద్రత కల్పించడం మా బాధ్యత
సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్నట్లుగా సదరు రిమాండు ఖైదీ రాజమండ్రి కేంద్ర కారాగారంలో మరణించలేదని, ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. కారాగారంలో డెంగ్యూ జ్వరం, మరే ఇతర జ్వరం కానీ ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, జైలులో ఫాగింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి జైలులో ప్రస్తుతం 2064 మంది ముద్దాయిలు/ఖైదీలు, 200 నుంది సిబ్బంది ఉన్నారని, వీరందరికీ ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని రవి కిరణ్ అన్నారు. వారి ఆరోగ్య భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. లేనిపోని భయాందోళనలకు గురికావద్దని సూచించారు. 


చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆందోళన 
రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీ సత్యనారాయణ మృతిచెందడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అయితే జైల్లోనే చంద్రబాబు నాయుడును హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబును దోమలతో కుట్టించి హత్య చేసేలా సైకో సీఎం వైఎస్ జగన్ కుతంత్రాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ డెంగ్యూ వ్యాధితో ఖైదీ చనిపోవడంతో చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై తమకు ఆందోళన నెలకొందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.