Rajahmundry Central Jail Superintendent Rahuls wife passes away:


రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతి చెందారు. కిరణ్మయి కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కిరణ్మయి కన్నుమూశారు. భార్యతకు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రెండు రోజుల సెలవుపై వెళ్లారని తెలిసిందే.


ఆరోగ్యం క్షీణించడంతో సెంట్రల్ జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్‌ భార్య కిరణ్మయిని అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భార్యకు అనారోగ్యం కావడంతో రాహుల్ సెలవు తీసుకున్నారు. దాంతో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్‌కు రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్‌ఛార్జిగా అదనపు బాధ్యతలను అప్పగించారు.


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 11న చంద్రబాబును విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు తరలించి స్నేహ బ్లాక్ లో ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబుకు జైల్లో సౌకర్యాలు సరిగ్గా అందడం లేదని, ఆయన వయసు, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని హౌస్ రిమాండ్ కు ఇవ్వాలని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో చంద్రబాబు భద్రతపై సైతం భార్య నారా భువనేశ్వరి అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. నేడు చంద్రబాబుతో ములాఖత్ కోసం నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకోగా జైలు అడిషనల్ ఇంఛార్జి రవి అందుకు అనుమతి నిరాకరించారు.


రాహుల్ భార్య కొద్దిసేపటి కిందటే చనిపోయారు - కోస్తా జిల్లాల జైళ్ళశాఖ ఐజి, రవికిరణ్ 
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడాన్ని వక్రీకరించవద్దు అని కోస్తా జిల్లాల జైళ్ళశాఖ ఐజి, రవికిరణ్ కోరారు. రాహుల్ భార్య కొద్దిసేపటి కిందటే చనిపోయారు అని తెలిపారు. తామంతా చాలా మెంటల్ స్ట్రెస్ లో ఉన్నామని, తమ దగ్గర క్లారిఫికేషన్ తీసుకుని వాస్తవాలు రాయాలని మీడియాకు సూచించారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలు అని చెప్పారు. మా పరిస్థితి అర్థం చేసుకోండి, మా బాధ్యతల్ని మేము ఎప్పుడూ విస్మరించము. మా అమ్మ కూడా మే నెలలో చనిపోయారు, ఇలాంటి పరిస్థితుల్లో అందరం మెంటల్ స్ట్రెస్ లో ఉన్నామని తెలిపారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అవాస్తవాలు మాత్రం ప్రచురించవద్దు అని కోస్తా జిల్లాల జైళ్ల డిఐజి రవికిరణ్ కోరారు. 


దుష్ప్రచారం చేయవద్దు, నిజాలు వెల్లడించండి... తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ
రాహుల్ విషయంలో అవాస్తమైన వార్తలు వచ్చాయని, జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య ఆరోగ్యం బాగా లేనందునే సెలవు పెట్టారు అని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. కనుక విషయం తెలుసుకుని, నిజాలు మాత్రమే ప్రచారం చేయాలని కోరారు. కొందరు ఉద్దేశపూర్వకంగా, చంద్రబాబు జైలులో ఉన్నందునే సెలవులో వెళ్లాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అధికారిక సమాచారం లేకుండా నిరాధారమైన వార్తలు, కథనాలు ప్రచురించవద్దని, సోషల్ మీడియాలోనూ షేర్ చేయవద్దని కోరారు.