సీఆర్డీఏ పరిధిలో అవకతవకలకు పాల్పడి హైకోర్టులను అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకున్న కార్యక్రమాలు గతంలో ఎన్నో చూశామని, స్టేలతో కాలయాపన చేయడం ఆయనకు అలవాటు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. కరకట్ట దగ్గర గెస్ట్ హస్ ఆయనకు ఏవిధంగా ఆయనకు వచ్చిందో చెప్పాలని వైసీపీ ఎంపీ ప్రశ్నించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ భరత్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
కరకట్ట దగ్గర క్విడ్ ప్రోకో కింద గెస్ట్ క్రిమినల్ అమెండ్‌మెంట్ యాక్ట్ 1944 ప్రకారం గెస్ట్ ఎలా సంక్రమించింది అంటూ నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబందించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇద్దరూ లింగమనేని రమేష్ అనే వ్యాపారస్తుడికి అక్కడి భూముల్లో లబ్దిచేకూర్చే విధంగా ఈ కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్‌ను ఎక్స్ ఛేంజ్ చేసుకున్నారు అని ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు.
ప్రజలకు చంద్రబాబు ఏం సందేశమిస్తున్నారు.?
క్రిమినల్ అమిండ్‌మెంట్ యాక్ట్, ఎన్జీటీ గైడ్‌లైన్స్‌ను తుంగలోకి తొక్కి నదీ ప్రవాహం ఉన్న ప్రాంతం వద్ద గెస్ట్ హౌస్ కట్టారు. అక్కడే ప్రజావేదిక కట్టిన సందర్భంఉంది.. అంటే చంద్రబాబు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు.. ఇవన్నీ చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు ఎంపీ భరత్.. హెరిటేజ్‌కు సంబంధించి భూములు కూడా లింగమనేని రమేష్ దగ్గర నుంచే కొనుగోళ్లు చేశారని, ఇవన్నీ క్విడ్‌ప్రోకో చేసిన అక్రమం అని కనపడడం లేదా అని ప్రశ్నించారు. పదవులు చేతిలో పెట్టుకుని లబ్ధి చేకూర్చే విధంగా ఎలైన్‌మెంట్‌లు మార్చారు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించాలని సూచించారు.
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది..
చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదని, సీఆర్‌డీఏ అనేది పెద్ద స్కామ్ అని, ఇక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో పేదలు నివాసం ఉండకూడదా అంటూ ఎంపీ భరత్ మండిపడ్డారు. ఏ విధంగా వీళ్లు పిటీషన్లు వేస్తున్నారన్నారు. అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి సెంటు స్థలాలకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్ హైకోర్టులో డిస్మిస్ చేసిందని, అయితే సుప్రీం కోర్టులో సైతం ముక్కుమీద వేలు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అమరావతిలో నివాసం ఉండకూడదని ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు జాతి అహంకారాన్ని ప్రజలు గమనించాలని వైసీపీ ఎంపీ భరత్ కోరారు.
అభివృద్ధిపై హోర్డింగులు పెట్టుకుంటే మీకేంటి బాధ..
తాము చేసిన అభివృద్ధిపై రాజమండ్రిలో హోర్డింగ్‌లు పెట్టుకుంటే మీకేంటి బాధ అని టీడీపీ నాయకులను ఎంపీ భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ హోర్డింగ్‌లపై మాట్లాడుతున్నాడని, ప్రయివేటు సంస్థ నుంచి డబ్బులు కట్టి హోర్డింగ్‌లు తీసుకుంటే మీకు ఎందుకు..? అని ప్రశ్నించారు. ముందస్తుగా డబ్బు కట్టి ఓ ప్రయివేటు సంస్థలనుంచి తీసుకున్నామని, ఆపని మీరు చేసుకోవచ్చుగా అని సూచించారు. మీ మహానాడు అయితే మాకేంటి, అవ్వకపోతే మాకేంటి అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో తాను చేస్తున్న అభివృద్ధిపై హోర్డింగ్‌లు పెడుతున్నాం అన్నారు.