Cylone Montha Impact on AP | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. భారత వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం, ఈ మొంథా తుపాను మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా నరసాపురం సమీపంలో తీరం దాటింది. రాత్రి 11:30 నుండి 12:30 గంటల మధ్య మొంథా తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తయింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే సమయంలో తుపాను కదిలిందని అధికారులు తెలిపారు.
మొంథా తుపాను తీరం దాటినప్పటికీ, ఏపీపై దాని ప్రభావం కొనసాగుతోంది. మొంథా ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ మీదుగా ప్రయాణించి, బుధవారం (అక్టోబర్ 29) మధ్యాహ్నం నాటికి ఛత్తీస్‌గఢ్ వద్ద మరింతగా బలహీనపడనుంది. తుపాను ప్రభావంతో తీరంలో గంటకు 85 కి.మీ నుండి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
రెడ్ అలర్ట్, భారీ వర్ష సూచనమొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కోస్తాంధ్ర జిల్లాలలో పాటు, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. మరో 24 గంటలపాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు..
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో వర్షాలు రాత్రి తుపాను నరసాపురానికి సమీపంలో తీరాన్ని తాకింది. మొంథా తుపాను నేటి మధ్యాహ్నానికి బలహీనపడనుంది. దాని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల 80-180 మి.మీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లోనూ సాయంత్రం వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
ఆదిలాబాద్, కొమురం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు.
విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపుతుపాను కారణంగా చాలా ప్రాంతాలలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. దీని ఫలితంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల్లో విద్య సంస్థలకు అక్టోబర్ 31 వరకు సెలవులు పొడిగించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజులపాటు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.