పిఠాపురం మున్సిపాల్టీలో ఇంజనీరింగ్ అధికారులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం.. వైసీపీ నేతల మాటలు విని నిండా మునిగారా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిద్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీలో అవినీతి అధికారులపై చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం.. గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ చేసిన అధికారులకు అక్రమాల దోపిడీ బట్టబయలయ్యింది.. దీంట్లో భాగంగా కొందరు అధికారులపై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు..
వైసీపీ నేతలు ఏం చెబితే అది చేశారా..?
పిఠాపురం మున్సిపాలిటీలో గత పాలకులను నమ్మి పనిచేసిన పాపానికి కొంత మంది అధికారులు నిండా మునిగిపోయిన పరిస్తితి కనిపిస్తోంది.. పిఠాపురం మున్సిపాల్టీలో గతంలో ఇక్కడ పనిచే సిన ఇద్దరు డీఈలతోపాటు, ముగ్గురు ఏఈలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ అధి కారులు ఇచ్చిన నివేదికపై అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వైసీపీ హయాంలో జరిగిన పాపాలకు ఇప్పుడు అధికారులు బలవ్వడం స్థానికంగా సంచలనంగా మారింది.
రూ.7 కోట్ల మేర అవినీతి చిట్టా...
పిఠాపురం మున్సిపాలిటీలో అవినీతికి అంతే లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.. చేయని పనులకు బిల్లలు పెట్టుకుని దోపిడీ పర్వానికి పాల్పడ్డారని ప్రజలు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాధులు లేని పరిస్థితి కనిపించింది.. వేయని తాగునీటి పైపులైను వేసినట్లుగా చూపించి బిల్లులు డ్రా చేయడం, వేయని రోడ్లు వేశామని బిల్లులు సృష్టించి కాజేయడం వంటి ఆరోపణలు ఇక్కడ పనిచేసిన అధికారులపై తీవ్రంగా ఉంది..
వైసీపీ పాలనలో పిఠాపురం మున్సిపాల్టీలో 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబందించి జరిగిన అభివృద్ధి పనుల్లో సుమారు రూ.7 కోట్ల నిధులు గోల్‌మాల్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా ఆ ఆరోపణలు, ఫిర్యాదులు అన్నీ బుట్టదాఖలు అయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక, పైగా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచాక అందరిలోనూ భయం మొదలయ్యింది..
విజిలెన్స్ నివేదికలో ఏం తేల్చిందంటే..
పిఠాపురం పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి పేరిట అనేక అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. వీటిలో ముఖ్యంగా జగ్గయ్యచెరువు కాలనీ, డ్రైవర్స్ కాలనీతోపాటు, మాధవపురం రోడ్డులోని మున్సిపాల్టీకి చెందిన ప్రాంతంలో జరిగిన పనుల్లో లోని భారీ అవకతవకలను విజిలెన్స్ అధికారుల కమిటీ గుర్తించింది. గుడ్డిగా పనులు చేసి, బిల్లులు మంజూరు చేసారని. అన్ని తెలిసి అధికారులు వ్యవహరించారని నిర్ధారించింది. ఏకంగా రూ.30 లక్షల నిధులకు అసలు పనులు జరగలేదని, అయినప్పటికీ ఆ నిధులను డ్రా చేసినట్లు తేల్చింది. వీటితోపాటు పనులు నాసిరకం, ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం జరిగాయని విజిలెన్స్ లో స్పష్టం చేసింది. ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1339 ని విడుదల చేసింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ అధికా రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
184 విజిలెన్స్ నివేదిక
పిఠాపురం మున్సిపాల్టీలో డీఈలుగా పనిచేసిన భవానీ శంకర్, ఎమ్.టి.హుస్సేన్ పాటు, ఏఈలుగా పనిచేసిన వంశీ అభిషేక్, నరసింహ రావు, రత్నవల్లిలపై ప్రభుత్వం చర్యలకు ఆదే శించింది. వీరు పనిచేసిన కాలంలో జరిగిన పనుల్లో భారీ అవకతలను విజిలెన్స్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 184 పేజీలతో కూడిన ఆ నివేదికతో కలిపి ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా జీవో జారీ చేసింది. ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ అధికారులంతా ప్రస్తుతం వేరే చోట్ల పనిచేస్తున్నారు.
అప్పట్లో పిఠా పురంలో ఉన్న వైసీపీ నేతల అండతో వీరంతా ఇష్టా నుసారంగా అవకతవకలకు ఆజ్యం పోశారు. ముఖ్యంగా వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు గు గుడ్డిగా ఎమ్ బుక్ లను చేయడం. బిల్లులు డ్రా చేసేందుకు అనుకూలంగా సంతకాలు చేశారు. జరగని పనులకు కూడా జరిగినట్లుగా చూపించి నిధులు డ్రా చేసి అడ్డంగా బుక్కయ్యారు. గతంలో దీనిపై పిఠాపురం టీడీపీ కౌన్సిలర్లు పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో చర్చించడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చేసినప్పటికీ, అప్పట్లో వైసీపీ అండతో వీరంతా లెక్క చేయకుండా పని చేశారు. ప్రస్తుతం ఆ పర్యవసనాలను ఎదుర్కొంటున్నారంటున్నారు.