శ్రీకాళహస్తిలో ఓ మహిళా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ జనసేన కార్యకర్తను రెండ్రోజుల క్రితం కొట్టిన సంగతి తెలిసిందే. అతని రెండు చెంపలపై ఆమె వాయించింది. దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తణుకు నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీర మహిళలతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటుంటే అతణ్ని ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. అయితే, ఈ విషయంలో తాను ఇప్పుడు ఇంక మాట్లాడబోనని, తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి సంగతేంటో తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీపైన కూడా పవన్ కల్యాణ్ మాట్లాడారు. షర్మిల పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆమెకు తాను శుభాకాంక్షలు చెప్పానని చెప్పారు. ఆమె పెట్టిన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తు్న్నారని ఈ మధ్య తాను కూడా విన్నానని అన్నారు. అయితే, ఒక పార్టీ నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదని పవన్ కల్యాణ్ అన్నారు. సైద్ధాంతిక బలం, ఓర్పు ఉంటేనే పార్టీని నడపగలమని అన్నారు. పార్టీ పెట్టిన తక్షణమే అధికారంలోకి రావాలనే ఉద్దేశం మంచిది కాదని అన్నారు. అలాగైతే తాను అప్పుడే నేను కాంగ్రెస్‌లోకి వెళ్లేవాడినని అన్నారు. సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే దాని కోసం చచ్చిపోయే వరకూ పోరాడాలని అన్నారు.
జగ్గుభాయ్ కి జనసేనకి మధ్య పోరాటం - పవన్ కల్యాణ్
వాలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యం అని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గుభాయ్ గ్యాంగ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఆ భ్రమలు తొలగిస్తామని చెప్పారు. సాక్షి పేపర్ కోసం ఏటా రూ.48 కోట్లు ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అర్హతలేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల సమావేశంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.