మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వం దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మద్యం ధరల రూపేణా అధిక ధరలు వసూలు చేస్తూ ప్రజల పొట్ట కొట్టి, ఆ డబ్బుల్నే సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నారని అన్నారు. రూ.40, రూ.70 రూపాయలు ఉండే మద్యం ఇప్పుడు రూ.150, రూ.400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యాలను ఛిద్రం చేసి, ఆడవారి పుస్తెలు తెంచి వ్యాపారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం కాబట్టి, జనసేన ప్రభుత్వం వస్తే పాత ధరలకే మద్యాన్ని అమ్ముతామని హామీ ఇచ్చారు. ఎవరైనా మహిళలు తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు వద్దనుకుంటే ఆ ప్రాంతంలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ భీమవరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
జగన్ పర్సనల్ విషయాలు చెప్తే చెవుల్లో నుంచి రక్తమే..
సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూడా పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు. ఆయన విషయాలు చెప్తే చెవుల్లో నుంచి రక్తమే కారుతుందని ఎద్దేవా చేశారు. జగన్ చిన్న వయసులో ఉండగా తన తాత ప్రోత్సాహంతో ఎస్‌ఐ ప్రకాశ్ బాబుని స్టేషన్‌లో పెట్టి కొట్టారని ఆరోపించారు. ఆయనకు పోలీసు వ్యవస్థపై గౌరవం లేదని, రఘురామకృష్ణం రాజును పోలీసులతో కొట్టించారని గుర్తు చేశారు. గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా మార్చిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై అని.. నిండా మునిగాక ఇంకా చలేంటని మాట్లాడారు.
నోటికి సైలెన్సర్లు బిగించుకోండి
జనసేన సత్తా ఏంటో అసెంబ్లీలో చాటాలి. పాతికేళ్ల పాటు మీకోసం కూలీగా పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. నేను ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతుంటే, పర్సనల్ గా నాపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు నాకు చాలా తెలుసు. సీఎం, మంత్రుల ఆగడాలు మొత్తం చెప్పగలను. నేను చెప్పేది వింటే జగన్ చెవుల్లో నుంచి రక్తం బయటికి వస్తుంది. ఫ్యాక్షన్, క్రిమినల్స్ అని జగన్ బ్యాగ్రౌండ్.. నేను విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. నోటికి సైలెన్సర్లు బిగించుకోండి’’ అని వపన్ కల్యాణ్ మాట్లాడారు.