Malikipuram ONGC Blowout | మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ మంటలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 15 గంటల పాటు భీకరంగా ఎగసిపడిన మంటల తీవ్రత ఇప్పుడు కొంత మేర తగ్గడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఓఎన్జీసీ (ONGC) సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో మంటలను అదుపు చేసేందుకు సోమవారం ఉదయం నుంచి ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
గొడుగు ఆకారంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..
అంబ్రెల్లా ఫార్మ్ (గొడుగు రూపం) విధానం ద్వారా భారీ పైప్‌లైన్లతో గొడుగు ఆకారంలో నీటిని లోపలికి పంపిస్తూ, ఆ ప్రాంతాన్ని మొత్తం కూలింగ్ చేస్తున్నారు. నిన్నటితో పోల్చితే పరిస్థితి 50 శాతం వర మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇరుసుమండలో ఘటనా స్థలంలో పరిస్థితిని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండగా, ఎంపీ హరీష్ మాధుర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
సోమవారం నాడు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రింగ్ లోపలికి వెళ్లేందుకు సాహసించని ఓఎన్జీసీ సిబ్బంది, నేడు మంటలు కాస్త తగ్గడంతో దగ్గరకు వెళ్లి మంటలను పూర్తిగా ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. గ్రామానికి చెందిన ప్రజలు గత రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమీప పరిసర ప్రాంతాల్లోని కొబ్బరి చెట్లు మంటలకు కాలిపోయాయి. చుట్టుపక్కల వరి రైతులు మంటల భయంతో నారుమళ్లు పనులు ఆపేశారు. ఈ బ్లూ అవుట్ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అయితే బాధిత రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.
బ్లో అవుట్ అంటే ఏమిటి? భూమి లోపల చమురు లేదా గ్యాస్ నిక్షేపాలు భారీ పీడనం వద్ద ఉంటాయి. వీటి కోసం మేషిన్లతో డ్రిల్లింగ్ చేసినప్పుడు, ఆ పీడనాన్ని నియంత్రించడానికి ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మడ్ అనే ద్రవాన్ని బావిలోకి పంపుతారు. ఈ ద్రవం బరువు లోపలి పీడనాన్ని తగ్గిస్తుంది. అయితే, కొన్నిసార్లు భూగర్భంలో ఊహించని విధంగా పీడనం ఒక్కసారిగా పెరిగినప్పుడు లేదా డ్రిల్లింగ్ మడ్ బరువు తగ్గిన సమయంలో లోపలి గ్యాస్, చమురు నియంత్రణ తప్పి అత్యంత వేగంతో పైకి తన్నుకొస్తాయి. అలా రావాన్ని కిక్ అంటారు. ఈ కిక్ ను నియంత్రించలేకపోతే అది బ్లో అవుట్ గా మారి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించేలా చేస్తుంది.