NTR Centenary Celebration: మహానాడు వేదికగా ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. చంద్రబాబు డిజిటల్ సంతకం ద్వారా ప్రతినిధుల సభకు ఆహ్వానాలు అందిస్తామని పేర్కొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అద్భుతమైన మార్పులు తెచ్చారని గుర్తు చేశారు.


రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించే మహానాడులో అన్ని అంశాలపై చర్చలు జరుపుతామ్ననారు. రాజకీయ, సాంఘీక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దామని తెలిపారు. గే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలపై చర్చిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మే 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా రామమహేంద్రవరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. వేమగిరి, ధవళేశ్వరం పరిధిలోని మహానాడు ప్రతినిధుల సభ ఇప్పటికే సిద్ధమైంది. ఇక్కడ ఏసీ హాల్ ను కూడా సిద్ధం చేశారన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొస్తున్నాయన్నారు. 


ఇంటింటికీ తిరుగుతూ బొట్టు పెట్టి మరీ అహ్వానం


పసుపు తోరణాలతో రాజమహేంద్రవరం వీధులను పసుపుమయం చేస్తున్నారు. పలువురు నేతలు ఇప్పటికే ఇక్కడ బస చేశారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామకృష్ణారెడ్డి, గన్నికృష్ణ, ఆదిరెడ్డి వాసు, అనగాని సత్యప్రసాద్, తదితరులు ఏర్పాట్లను ప్రయవేక్షిస్తున్నారు. గోదావరి జిల్లాలన్నీ పసుపుమయం కావాలని, ప్రతి ఇంటి నుంచి జనం తరలి రావాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఎవరికి వారు పసుపు తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ లోని పిడింగొయ్య జైహింద్ నగర్ లో తెలుగు మహిళలు బుధవారం రోజు ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి మరీ మహానాడుకు ఆహ్వానించారు. తెలుగు వాళ్ల పండగకు ఇంటిల్లిపాదితరలి రావాలని రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కొయ్యన కుమారి తదితరులు కోరారు. 






మూడ్రోజుల పాటు రాజమహేంద్రవరంలోనే చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం రోజు మధ్యాహ్నం వరకు రాజమహేంద్రవరానికి చేరుకుంటారు. మంజీరా ఇంటర్నేషనల్ హోటల్ లో ఆయన దిగుతారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తారు. మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాల మీద, ఏర్పాట్ల మీద చర్చిస్తారు. ఆయన మూడ్రోజుల అక్కడే ఉంటారు. మహానాడు తొలి రోజు ప్రతినిధుల సభలో 15 తీర్మానాలపై చర్చ జరగనుంది. 15 వేల మంది ప్రతినిధులు పాల్గొనేందుకు పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. వేదిక మీద చంద్రబాబుతో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ ముఖ్య నేతల, 175 అసెంబ్లీ నియోజక వర్గాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటరీ ఇంఛార్జీలు ఆశీనులు అవుతారు. వేదిక మీద సుమారు 300 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో తీర్మానంపై కనీసం ఇద్దరు చొప్పున 50 మంది వరకూ మాట్లాడే అవకాశం ఉంది.