Nara Lokesh | అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి, ఆమె కుమారుడు విజయ్ ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తల్లి, కొడుకు ఇద్దరూ ఒకేసారి ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడం ఎంతో అద్భుతమైన విషయమని, వారి ఆనందాన్ని మాటలలో వర్ణించలేమని ఆయన తన ఎక్స్ వేదికగా కొనియాడారు. గృహిణిగా ఉంటూనే చదువుకోవాలనే పట్టుదలతో ఓపెన్ స్కూల్‌లో చేరి పరీక్షలు రాసిన లక్ష్మీ లహరి కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
పరీక్షా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన ఆ కుటుంబంలో, తల్లి లక్ష్మీ లహరి 360 మార్కులు సాధించగా, కుమారుడు విజయ్ 562 మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆ కుటుంబంలో సంతోషాలు, వారిద్దరి సంబరాలను చూసి తాను ఎంతో ఆనందించానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తల్లికి అభినందనలు, కుమారుడికి ఆశీస్సులు తెలియజేస్తూ.. చిన్న చిన్న కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ లహరి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నారా లోకేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ ఏడాది 85.25 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ఏడాది పాటు పడిన కష్టానికి, వారికి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్ల శ్రమకు ఈ ఫలితాలు నిదర్శనమని కొనియాడారు. కేవలం సాధారణ విద్యార్థుల ఫలితాలనే కాకుండా, ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలను కూడా అదే సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో గణనీయమైన ప్రగతి సాధించామని మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మార్పుల సానుకూల ప్రభావం ఈ రిజల్ట్స్‌లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, గత ఏడాది ఇది 81.14 శాతంగా నమోదైంది. ఈసారి గతంతో పోలిస్తే దాదాపు 4 శాతం మేర ఉత్తీర్ణత పెరగడం విశేషం.
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90గా నమోదు కాగా, బాలురు 82.68 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని లోకేష్ తెలిపారు. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత, ఈసారి ఏకంగా 78.39 శాతానికి పెరగడం ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
