Mudragada padmanabham: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ మార్కు కనిపిస్తుందా.. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే చర్చ సాగుతోంది.. ప్రతక్ష రాజకీయాలకు సుధీర్ఘకాలంగా దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలతో మమేకమవ్వడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్నారన్న చర్చకు తెరలేపింది. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఇంటికి తరలివచ్చిన నాయకులు, అభిమానులతో ముద్రగడ పద్మనాభంతోపాటు ఆయన కుమారుడు ముద్రగడ చల్లారావు(గిరి) మమేకమవ్వడంతో వైసీపీ తరపున ముద్రగడ కుటుంబంలో ఎవరో ఒకరు పోటీచేయనున్నారన్న ప్రచారం ఊపందుకుంది.. 


తండ్రి ఆదేశిస్తే సిద్ధమన్న కుమారుడు..
జనవరి ఒకటో తేదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారందరితో ముద్రగడ పద్మనాభంతోపాటు ఆయన కుమారుడు చల్లారావు కూడా మమేకమయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు చల్లారావు మాత్రమే సమాధానం ఇచ్చారు. కాపుల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని, ఆయన ఏది ఆదేశించినా దాని అనుగునంగా తాను పనిచేస్తానని తెలిపారు. తండ్రి ఆదేశిస్తే పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ఒక్కసారిగా కుమారుడు తెరమీదకు రావడంతో ఈసారి ఎన్నికల్లో కుమారుడే నిలబడతాడని తేలిపోయిందని పలువురు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 


కాపు ఓటు బ్యాంకు లక్ష్యంగా పావులు..
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓటు బ్యాంకు కీలకం కాగా కాపుల్లో అగ్రభాగం అంతా జనసేన పార్టీకే పనిచేసే అవకాశం ఉంది. వైసీపీ, టీడీపీల్లో కాపులున్నా వారి శాతం కేవలం 10 శాతం లోపు మాత్రమే. ఈనేపథ్యంలోనే కాపు ఓటు బ్యాంకును చీల్చగలిగితే విజయం చాలా వరకు తధ్యం అన్న ఆలోచనలో పలు రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే ముద్రగడను వైసీపీ ఆహ్వానిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకు తీవ్రంగా నష్టపోయేది వైసీపీ నే కాగా అందుకే ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందంటున్నారు. అయితే ఆయన ముందుకు రాకపోగా ఆయన కుమారుడ్ని ముందుకు పంపించే అవకాశాలే ఉన్నాయని, అందుకే నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కుమారుడు తెరమీదకు వచ్చారని ప్రచారం జరుగుతోంది.


ముద్రగడ వెంట కాపులు నడుస్తారా..?
కాపు ఉద్యమ నాయకుడిగా మంచి పేరున్న ముద్రగడ పద్మనాభం సుధీర్ఘకాలంగా రాజకీయంలోఉన్నారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే అధికశాతం జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెంటే కాపులుండగా ముద్రగడ వెంట ఏమేరకు కాపులు నడిచే అవకాశం ఉందన్నది తేలాల్సి ఉంది.. కాపుల అభ్యున్నతికోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ముద్రగడకు పొలిటికల్‌ కేరీర్‌ కేవలం కాపు ఉద్యమ నేపధ్యమే దెబ్బతీసిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీకు దింపాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. అయితే ముద్రగడనే రంగంలోకి దిగుతారా.. లేక ఆయన కుమారుడ్ని పోటీలో దింపుతారా అన్నది వేచిచూడాల్సి ఉంది.. 


వైసీపీ పెద్దలతో ముద్రగడ టచ్‌లో ఉన్నారా..
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న ప్రచారం గత మూడు నెలలుగా సాగుతోంది.. ముద్రగడను ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్‌ ఎంపీ మిధున్‌ రెడ్డి కలిశారని, ఆయన మంతనాలతో ముద్రగడను పార్టీలో వచ్చేందుకు ఒప్పించారన్న ప్రచారం జరిగింది. 2014 లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వంపై ముద్రగడ పద్మనాభం గట్టి పోరాటమే చేశారు. కాపులకు రిజర్వేషన్లు కోసం చేసిన ఆ ఉద్యమంలో ఆయన్ను దారుణంగా అణచివేశారని చంద్రబాబుపై బహిరంగ ఆరోపణలు చేశారు. ఆతరువాత జనసేన అధినేత వారాహి యాత్ర సందర్భంగా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ముద్రగడ పద్మనాభంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే బహిరంగ లేఖల ద్వారా గట్టి సమాధానం ఇచ్చిన ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికు పలు లేఖలు రాశారు. కాపు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.