AP Latest News in Telugu: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ ఓ పక్క తీవ్రంగా జరుగుతుంటే.. మరో పక్క పిఠాపురంలో ఎవరు గెలుస్తారు..? అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ తీవ్రంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.. దీనికి ప్రధాన కారణం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఓ కారణం అయితే పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తా... ఓడించ‌క‌పోతే నా పేరు మార్చుకుంటానని శపథం చేసిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాలుతో మరో ఉత్కంఠకు దారితీసిన పరిస్థితి ఉంది.


2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చవిచూసిన పవన్‌ కల్యాణ్‌కు ఈ ఎన్నికల్లో విజయం అత్యంత అవసరం కాగా ఆయన వ్యూహాత్మకంగా కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీచేశారు. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గంపై పడింది. విభిన్న తీర్పులిచ్చే పిఠాపురం ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారు అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా జరుగుతోంది.. అయితే పవన్‌ కల్యాణ్‌ను ఓడిరచేందుకు అధికార వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేసింది.. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ పోటీచేయడం వెనుక అసలు కారణం ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక ఓట్లు ఎక్కువగా ఉండడం కాగా ఇదే వ్యూహంతో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఇక్కడ బరిలోకి దింపింది.. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున వంగా గీత ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నేపథ్యం ఉండడంతో గీత గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది.


ముద్రగడ ఎంట్రీతో మరింత కాక..


కాపు ఉద్యమ నాయకునిగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన తరువాత వైసీపీ గెలుపుకోసం పనిచేశారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తామని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తామని ముద్రగడ పద్మనాభం శపథం చేశారు. అంతేకాదు.. మీడియా సాక్షిగా పవన్‌ కల్యాణ్‌ గనుక గెలిస్తే తన పేరు పధ్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరారు. దీంతో పిఠాపురం రాజకీయం మరింత వేడెక్కింది. 


గెలుపుపై ఎవరికివారు ధీమా..


పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని అభ్యర్థి వంగా గీతతోపాటు ముద్రగడ, ఇతర వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా ఇప్పటికే టీడీపీ నాయకుడు వర్మ పవన్‌ కల్యాణ్‌ గెలుపు ఇక లాంఛనమే అని చెప్పుకొస్తున్నారు.. ఇదే నియోజకవర్గ గెలుపు, మెజార్టీపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.. నియోజకవర్గంలో 70 వేలకు పైబడి ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లతోపాటు ఎస్సీ, బీసీలు అంతా పవన్‌ కల్యాణ్‌కు ఓటువేశారని, ఈ సారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ గెలవబోతున్నారని జనసైనికులు చెబుతున్నారు. 


సోషల్‌ మీడియా వేదికగా ట్రోలింగ్స్‌..
పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సవాలు విసరడంతో సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవం పేరిట ఆహ్వాన పత్రికలు తయారుచేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏదిఏమైనా జూన్‌ 4న ఏపీలో ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. పిఠాపురం ఎవరి పరం కానుందో ఆరోజే భవితవ్యం తేలనుంది. ఆరోజు కోసం రాష్ట్ర ప్రజలే కాదు.. తెలుగువారు ఎక్కడున్నా అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు... ముఖ్యంగా పిఠాపురం గురించి మరింత ఎక్కువగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.