ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం జూన్ 26న రాజమహేంద్ర వరం వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కాకినాడ (Kakinada) జిల్లా కరప ప్రాంతానికి చెందిన ఓ మార్వాడి కుటుంబం కలిసేందుకు ఎదురు చూసింది.. ఈనెల 8న తమ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వారి ఆవేదనను ఫ్లకార్డుల ద్వారా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ వద్ద పవన్ కల్యాణ్ వెళ్లే మార్గంలో ఎదురు చూశారు.. కానీ వారిని పోలీసులు అనుమతించలేదు.. కానీ ఈ దృశ్యం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది.. పోలీసులకు ఎటువంటి ఆదేశాలు అందాయో తెలియదు కానీ 48 గంటల్లో మాత్రం పోలీసులు అదృశ్యం అయిన ఆ అమ్మాయిని వెతికి పట్టుకున్నారు.. సురక్షితంగా కాకినాడ తీసుకువచ్చి కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ సమక్షంలో తల్లితండ్రులు, కుటుంబికులకు అప్పగించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే...
కాకినాడ జిల్లా కరపకు చెందిన ఓ మార్వాడీ కుటుంబం 18 ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం కరప ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. అయితే వీరిలో ఓ దంపతులకు 14 ఏళ్ల కుమార్తె ఉంది.. ఈ బాలిక ఈనెల 8న అదృశ్యం కాగా ఆమె ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే ఫిర్యాదును తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే రోజులు గడుస్తున్నా ఫలితం లేదంటూ వారు ఈనెల 26న అఖండ గోదావరి ప్రాజెక్టు భూమి పూజకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి ఆయన వెళ్లే మార్గంలో ఫ్లకార్డులు పట్టుకుని తమ కుమార్తెను తిరిగి తమకు చేర్చాలని అభ్యర్థించారు. మొదట రాజమండ్రి ఎయిర్ పోర్ట్ వద్ద ఉండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.. అయితే ఆరోజు పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం మాత్రం రాలేదు..
పవన్ కల్యాణ్ ఆరా..
ఆ రోజు రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం లేకపోయినప్పటికీ ఈ దృశ్యం పవన్ కల్యాణ్ దృష్టిలో పడడంతో ఆయన ఆరా తీసిన క్రమంలో కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ కు ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పెంచారు. దీంతో బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను నియమించిన ఎస్పీ బిందుమాధవ్ మిస్సింగ్ కేసును 48 గంటల్లో ఛేదించేలా చర్యలు తీసుకున్నారు..
కృతజ్ఞతలు తెలిపిన మార్వాడి కుటుంబం..
తమ కుమార్తెను 48 గంటల వ్యవధిలో వెతికి తమకు అప్పగించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మార్వాడి కటుంబసభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమ బిడ్డ విషయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 48 గంటల వ్యవధిలో తమ బిడ్డను అప్పగించిన ఎస్పీ బిందు మాధవ్, ఇతర పోలీసుల అధికారులు, సిబ్బందికి, మీడియాకు వారు కృతజ్ఞతలు తెలిపారు.