Cibil Score Affect: సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటున్నారా? మీకు ఆర్థిక క్రమశిక్షణ ఉందా? ఈ రెండు వేర్వేరు విషయాలు అయినా సరే ఇప్పుడు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీకు ఎలాంటి ఉద్యోగం రావాలి, ప్రమోషన్ ఇవ్వాలా వద్దా అనేది కూడా తేలుస్తాయి. ఈ రెండింటిలో ఏ మాత్రం నెగిటివ్ రిమార్క్ ఉందంటే చాలు మీ గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోతుంది. 

ఇటీవలే తమిళనాడు(Tamil Nadu )లోని ఓ అభ్యర్థి రాత, మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణుడైనా కూడా సిబిల్ స్కోర్(Cibil Score) తక్కువగా ఉందని ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు కూడా బ్యాంకు నిర్ణయాన్ని సమర్ధించింది. ప్రజాధనం నిర్వహించే బ్యాంకుల్లో ఉద్యోగం చేసే వారికి ఆర్ధిక క్రమశిక్షణ అవసరమని పేర్కొంది. సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్నవారిపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రస్నించింది. సదరు బ్యాంకు నిర్ణయానికి మద్దతిస్తున్నామని ప్రకటించింది. జాబ్‌ దరఖాస్తు నిబంధనల్లో స్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది.

సిబిల్ స్కోర్ చాల వరకు బ్యాంకుల నుంచి లోన్‌లు తీసుకునేటప్పుడో, క్రెడిట్ కార్డు కావాలనుకున్నప్పుడే చూస్తారు. ఉద్యోగాలకు సిబిల్ స్కోర్‌కు ఏం సంబంధమని చాలా మంది అనుకుంటారు. కానీ సంబంధం ఉంందని చెబుతున్నారు అధికారులు. సిబిల్ స్కోర్ సరిగా లేని వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తామని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి.  

బ్యాంకింగ్‌ రంగాల్లో ఉద్యోగాలకు అనర్హత..?

సిబిల్‌ స్కోరు సరిగా లేని వారికి బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగ ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ నెలకొంటోంది. సాంకేతిక విద్యను అభ్యసించిన వారు కూడా బ్యాంకు ఉద్యోగాలకు తెగ పోటీ పడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో నిర్వహించిన పలు ఉద్యోగ నియామకాల పరీక్షల దరఖాస్తు స్వీకరణలోనే ఆర్ధిక క్రమశిక్షణ అంశాన్ని చేర్చారు. దీంతో కొంతమంది అప్లికేషన్ స్టేజ్‌లోనే అనర్హులు అవుతున్నారు. ఇందులో ప్రధానంగా ప్రజాధనం నిర్వహించే బ్యాంకు ఉద్యోగాల్లో అర్హతలకు సంబందించి దరఖాస్తుదారుడి సిబిల్‌ స్కోర్‌ కూడా అత్యంత అవసరం అని తెలుస్తోంది. దరఖాస్తుల్ోల ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తున్నాయి. ఒక వేళ అభ్యర్ధి రాత పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో మంచి మార్కులు వచ్చినప్పటికీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే అనర్హులు అవుతారు. 

సోషల్‌ మీడియా పోస్టులు ఎసరు పెడతాయి!

అరచేతిలో ఫోన్, అందులో నెట్‌ బ్యాలెన్స్‌, ఒక సోషల్‌ మీడియా యాప్ ఉంది కాదా అని ఏదిబడితే అది పోస్టు చేస్తుంటారు. అలా పెట్టే పోస్టులు ఇప్పుడు మీ క్రమశిక్షణకు కొలమానంగా మారుతున్నాయి. క్రమశిక్షణ పోగొట్టుకుంటే మీ ఉద్యోగానికి అనర్హులుగా చేయడానికి ఒక కారణం కావచ్చంటున్నారు. 

ఒక బృందాన్ని నడిపే నాయకుడికి ఓర్పు, సహనం, ఎదుటివారిపై మానవవత్వం తప్పనిసరి. అయితే ఇప్పుడు చాలా సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఇదే చూస్తున్నాయట. దీనికి కొలమానంగా అభ్యర్ధి సోషల్‌ మీడియా ఖాతాల వివరాలు రాబట్టి అందులో వారు పెట్టే పోస్టులు ఆధారంగా ఓ అంచనాకు వస్తున్నారట. ఆ వ్యక్తి సోషల్‌ మీడియాల్లో అతని వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే తెలుసుకోవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. అందుకే చాలా సంస్థలు సోషల్‌ మీడియా ఖాతాలు వివరాలు అడుగుతున్నాయని చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులు వారి మానసికస్థితి తెలుపుతాయని కోనసీమప్రాంతానికి చెందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీపాద రామకృష్ణ తెలిపారు. వారిలో ఉన్న అసహనం, కోపం, అతి ప్రవర్తన, హూందాతనం, మానవత్వం, సమాజంపట్ల వారి వైఖరి, అనవసర విషయాల్లో అతి జోక్యం.. ఇలా అనేక విషయాల్లో వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేటతెల్లం అయ్యిందని చెబుతున్నారు. 

సాప్ట్‌ వేర్‌ కంపెనీల్లో భర్తీ చేసే టీమ్‌ లీడర్‌ ఉద్యోగాలకు సంబంధించి వారి సోషల్‌ మీడియా ఖాతాల్లో పెట్టిన పోస్టుల వల్ల కొందరు తమ పదోన్నతి అవకాశాలను కోల్పోయారని గతంలో చాలా సంఘటనలు ఉదాహరణలుగా చెబుతున్నారు.