Konaseema News | గత నాలుగు రోజులుగా కోనసీమ తీర ప్రాంతాల్లో ఒకటే మాట వినపడుతోంది.. సముద్ర తీరంలో స్నానంచేసేవారిని జెల్లీ ఫిష్‌లు కరుస్తున్నాయని. సోషల్‌ మీడియాలో కూడా ఇది వైరల్‌గా మారింది... ఇంతకీ కోనసీమ ప్రాంతంలో నిజంగా జెల్లీ ఫిష్‌లు మనుష్యులను కరుస్తున్నాయా..? లేక మరేదైనా జీవులు వల్ల ప్రజలు భయపడుతున్నారా.. అంటే చాలా మంది అవును అది అగ్గిబాటా అంటున్నారు.. అంటే అది కరిస్తే శరీరంపై అగ్నిలా వేడిపుట్టి విపరీతమైన మంట, దురద వస్తుందని చెబుతున్నారు.. అంతర్వేది తీరంలో కనిపించిన వీటిని కొంతమంది ఫోటోలు, వీడియోలు కూడా తీశారు.. అవి నెట్టింట వైరల్‌గా మారడంతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా తీరప్రాంతాల్లో సముద్రంలోకి దిగాలంటేనే భయపడుతున్నారు...

అంతర్వేదిలో ఏం జరిగిందంటే...

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండల పరిధిలోకి వచ్చే అంతర్వేదిలోని సాగర తీరంలో ఆదివారం సముద్ర స్నానాలు చేస్తున్న కొంతమంది పిల్లలు ఒక్కసారిగా శరీరంపై దురద, మంట అంటూ బయటకు పరుగుతు తీశారు. ఏం జరిగిందా అని ఆరాతీస్తే ఇసుకలో కొట్టుకొచ్చిన జెల్లీ ఫిష్‌ను చూపించారు. దాన్ని పట్టుకున్నామని, వెంటనే జిగురు వంటి పదార్ధంలా తమకు అంటుకుందని అప్పటి నుంచి దురద, విపరీతమైన మంట వస్తుందని చెప్పారు. అయితే అక్కడున్న మత్స్యకారులు మాత్రం అది అగ్గిబాట అని, దాని వల్ల పెద్ద ప్రమాదం ఉండదని, కానీ దురద, మంట వస్తుందని తెలిపారు. అయినప్పటికీ పిల్లల్ని హుటాహుటీన పాలకొల్లులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. 

కోనసీమ తీరంలో నిజంగా జెల్లీఫిష్‌లు ఉన్నాయా..

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అంతర్వేది నుంచి యానాం వరకు సముద్రతీరం విస్తరించి ఉంది.. ప్రధానంగా అంతర్వేది, ఓడలరేవు, ఎస్‌.యానాం, యానాం తదితర ప్రాంతాల్లోని సముద్రతీరానికి ఎక్కువ మంది సందర్శకులు తరలివస్తుంటారు. కుటుంబ సమేతంగా వచ్చి సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే అంతర్వేదిలో కనిపించిన జెల్లీ ఫిష్‌లు ఓడలరేవు, ఎస్‌.యానాం ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇవేమీ కొత్త కాదని, సముద్ర తీరంలో సర్వ సాధారణంగా కనిపిస్తుంటాయంటున్నారు.  

హైడ్రోజోవా జాతికి చెందిన ఇవి ఎక్కువగా ఇటీవల కాలంలో సముద్రతీరానికి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జెల్లీ ఫిష్‌లలో ఒక వర్గానికి చెందిన బ్లూ బటన్‌ జెల్లీఫిష్‌, బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌ అంతర్వేది, ఓడలరేవు, యానాం తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. ఇవి ఇక్కడే ఎందుకు వస్తున్నాయంటే అంతర్వేది, ఓడలరేవు, యానాం ప్రాంతాల్లో నదీసాగర సంగమం వల్ల సముద్ర వడి ఎక్కువగా ఉంటుందని, ఈకారణం చేతనే ఇటువైపుగా కొట్టుకు వస్తుంటాయని చెబుతున్నారు. 

జెల్లీ ఫిష్‌లు కరుస్తాయా...

సముద్ర తీరాల్లో కనిపించే హైడ్రోజోవా (Hydrozoa) తరగతికి చెందిన జుల్లి ఫిష్ (Jellyfish) లలో కొన్ని జాతులు కరిచే (స్టింగ్ చేసే) సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే అన్ని జాతులు కరవవు కానీ ఇవి సాధారణంగా తమ ఆహారాన్ని పట్టుకోవడానికి లేదా రక్షణ కోసం "నెమాటోసిస్ట్స్" (nematocysts) అనే కణాలను ఉపయోగిస్తాయట‌. ఇవి విషపూరితమైన సూదుల వంటివి కాగా ఈ నెమాటోసిస్ట్స్ చర్మంతో సంబంధం కలిగినప్పుడు విషాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల కుట్టడం లేదా కరవడం జరుగుతుంది.

జుల్లి ఫిష్‌ను తాకితే ఏమవుతుంది?

హైడ్రోజోవా తరగతిలోని కొన్ని జాతులు, ఉదాహరణకు *Physalia physalis* (పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్) లేదా Gonionemus vertens వంటివి, తీవ్రంగా కరుస్తాయట‌..వీటిని తాకినప్పుడు, నెమాటోసిస్ట్స్ విషం చర్మంలోకి చొచ్చుకుపోతుంది, దీనివల్ల నొప్పి,  తీవ్రమైన మంట లేదా కుట్టడం వంటి అనుభ‌వం క‌లుగుతుంది. కుట్టిన చోట‌ చ‌ర్మం ఎర్రబడటం, వాపు లేదా దద్దుర్లు రావచ్చు, వాపు కూడా రావ‌చ్చంటున్నారు. కొందరిలో తీవ్రమైన అలెర్జీ లక్షణాలు (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకము)  ల‌క్ష‌ణాలు కూడా క‌నిపించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. చాలా అరుదైన సందర్భాల్లో తీవ్రమైన విష ప్రభావం వల్ల గుండె సంబంధిత సమస్యలు లేదా షాక్ వంటివి రావచ్చు, ముఖ్యంగా Physalia వంటి కొన్ని జాతుల విషయంలో ఇది జ‌రుగుతుందంటున్నారు.అయితే వీటిలో కరవని జాతులు కూడా ఉన్నాయ‌ట‌.. హైడ్రోజోవా తరగతిలోని కొన్ని జుల్లి ఫిష్‌లు, ఉదాహరణకు కొన్ని చిన్న హైడ్రాయిడ్‌లు, మనుషులకు హాని చేయలేని స్థాయిలో విషం కలిగి ఉంటాయి లేదా అసలు కరవవు. ఇవి తాకినా ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు.

జెల్లీ ఫిష్‌లు క‌రిస్తే ఏం చేయాలి..?

జెల్లీ ఫిష్‌లు తాకిన వెంటనే చర్మాన్ని సముద్ర నీటితోనే(తాజా నీరు కాదు) శుభ్రం చేయాలి.. ఎందుకంటే తాజా నీరు నెమాటోసిస్ట్స్‌ను మరింత చురుకుగా చేస్తుంది. వీలైతే, వెనిగర్ (vinegar) లేదా బేకింగ్ సోడా ద్రావణంతో ఆ ప్రదేశాన్ని కడగండి, ఇది విషాన్ని తటస్థీకరిస్తుంది. ఏదైనా అంటుకున్న టెంటకిల్స్‌ను (సన్నని రబ్బరు గ్లోవ్స్ లేదా ట్వీజర్స్ ఉపయోగించి) తొలగించాలి..నొప్పి లేదా అలెర్జీ లక్షణాలు తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అయితే వీటిని ర‌క్షించుకునేందుకు జెల్లి ఫిష్‌లు ఉన్న సముద్ర తీరాల్లో ఈత కొట్టేటప్పుడు రక్షిత దుస్తులు ధరించాల‌ని సూచిస్తున్నారు..