కల్తీ చేయడానికి కాదేదీ అనర్హం. అందుగలకు ఇందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్లుగా ప్రతి దాంట్లో నకిలీ, కల్తీ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. కల్తీ పాలు, కల్తీ టీ పౌడర్, ప్లాస్టిక్ బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది. తాజాగా నకిలీ సిగరెట్ ఉత్పత్తులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న గ్యాంగ్ గుట్టు రట్టుచేశారు పోలీసులు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో నకిలీ సిగరెట్లు నిల్వలను గుర్తించి, నిందితులను అరెస్ట్ చేశారు విజిలెన్స్‌ అధికారులు.


విజిలెన్స్‌ అధికారులు దాడులు 
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరిస్తూ సిగరెట్‌ పెట్టెలపై ధూమపానం వల్ల అవయవాలు ఎలా దెబ్బతింటాయో ఫొటోలతో సహా ముద్రిస్తున్నా ధూమపాన ప్రియులకు కొనడం మాత్రం ఆపడం లేదు. సిగరెట్‌ పెట్టెపై ఎటువంటి హెచ్చరిక ఫొటోలు ముద్రించినా తమకు అలవాటు కనుక అవేమీ వారికి కనిపించవు. సరిగ్గా ఇటువంటి వ్యసనాన్ని నకిలీ సిగరెట్‌ తయారీతో సొమ్ముచేసుకోవాలని కొందరు అక్రమార్కులు ప్రయత్నించి సొమ్ము జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ కోవకే చెందిన నకిలీ సిగరెట్‌ నిల్వలను రాజమండ్రి విజిలెన్స్‌ అధికారులు పట్టుకుని గుట్టురట్టుచేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో పలు హోల్‌సేల్‌ షాపులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్థానిక రెవెన్యూశాఖ, లీగల్‌ మెట్రోలజీ, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులతో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.14,22,600 విలువ చేసే నకిలీ సిగరెట్లుతోపాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణ యజమానులపై కోప్టా యాక్ట్‌ 2023 క్రింద క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 


అక్రమ విక్రయాలు ఇలా...
కాకినాడ జిల్లా తాళ్లరేవుకు చెందిన నున్నా వెంకట బుచ్చిరాజు అనే వ్యక్తి గుంటూరుకు చెందిన వెంకట్‌ అనే వ్యక్తి నుంచి సిగరెట్లను సేకరిస్తాడు. తన అల్లుడు ఎస్వీఎస్‌ఎన్‌ఎస్‌ సోబిత్‌ అనే వ్యక్తి ద్వారా నిషిక ఎంటర్‌ ప్రైజెస్‌ వ్యాపార ప్రాంగణంలో వీటిని నిల్వ ఉంచి రిటైల్‌గా స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. ఈ హోల్‌సేల్‌ దుకాణంలో సిగరెట్‌ ప్యాకెట్లుపై చట్టపరమైన వివరాలు లేనందున లీగల్‌ మెట్రాలజీ అధికారులు ఎల్‌ఎం యాక్ట్‌`2009 క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


అదేవిధంగా అమలాపురంలోనే యర్రమిల్లి వీధిలో వరలక్ష్మి జనరల్‌ మర్చంట్స్‌ను తనిఖీ చేయగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ చేసిన సిగరెట్‌ ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానిపై కోప్టా యాక్ట్‌ 2003 కింద, ఎల్‌ఎం యాక్ట్‌ 2009 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇదే యర్రమిల్లి వీధిలోనే శ్రీదేవి జనరల్‌ స్టోర్‌ను తనిఖీలు చేయగా ఇక్కడ కూడా నిషేధిత పొగాకు ఉత్పత్తులు, సిగరెట్‌ ప్యాకెట్లు లభించగా వాటిని స్వాదీనం చేసుకుని కోప్టా యాక్ట్‌ 2003, ఎల్‌ఎం యాక్ట్‌ 2009 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 


నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు..
నిషేదిత పొగాకు ఉత్పత్తులు కానీ, నకిలీ సిగరెట్లు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్సెమెంట్‌ అధికారి కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజమండ్రి విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్సెమెంట్‌ పరిధిలో మూడు జిల్లాలోని నిషేదిత సిగరెట్లను, నిల్వచేసిన అమ్మకము చేసిన దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.