Iran War Effect On Coconut Market:కొబ్బ‌రి అన‌గానే కేర‌ళ త‌రువాత కోన‌సీమ గుర్తుకు వ‌స్తుంది. కోన‌సీమ వ్యాప్తంగా కొబ్బ‌రి ఎగుమ‌తుల‌కు పెట్టింది పేరు. ఇక్క‌డి నుంచి ప్ర‌తీ రోజూ ట‌న్నుల కొద్దీ కొబ్బ‌రి స్వ‌దేశీ మార్కెట్‌కే కాక‌ ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తులు అవుతుంటాయి. అయితే మిడిల్ ఈస్ట్‌లో జ‌రుగుతోన్న ఇరాన్‌, ఇజ్రాయెల్, అమెరికా మ‌ధ్య యుద్థం ప్ర‌భావం ఈ కొబ్బ‌రి మార్కెట్ పైన కూడా ప‌డిందంటున్నారు కొబ్బరి వ్యాపారులు. ఈ ప‌రిస్థితి ఏపీలోని అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాతోపాటు త‌మిళ‌నాడు, కేర‌ళ‌ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావం ఉంటుందంటున్నారు. 

Continues below advertisement

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో ఇక్క‌డ న‌ష్టం ఎలా?

కొబ్బరి సాగుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక పెట్టింది పేరు. గ‌తంలో దేశీయ మార్కెట్‌లోనే కొబ్బ‌రి ఎగుమ‌తులు ఉండ‌గా కొన్నేళ్లుగా మ‌న దేశీయ కొబ్బ‌రికి మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్య‌మంగా ఏపీ, తమిళనాడు ప్రాంతాల‌ నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయంటున్నారు. 

Continues below advertisement

ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో కొబ్బ‌రికి డిమాండ్ ఏర్పడింది. సాంప్ర‌దాయ వంట‌కాల్లో కొబ్బ‌రిని ఎక్క‌వుగా వాడుతున్నార‌ని, దీంతోపాటు ఆదేశ సౌంద‌ర్య‌, ఇత‌రాత్ర త‌యారీ సామాగ్రిలో కొబ్బ‌రి వినియోగం బాగా పెరిగిందంటున్నారు. కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, సౌదీకి కొబ్బ‌రి ఎగుమతులు జ‌రుగుతుండ‌గా ఆ దేశాల‌కు ఎగుమ‌తులు చేసేందుకు అంతా సిద్ధం చేశారు.

ముంబై, చెన్నై పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయిన‌ర్లు..

ప్ర‌స్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావ‌ర‌ణంతో గుబులు పుట్టిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సేన‌లు విరుచ‌కుప‌డుతున్నాయి. మ‌రో పక్క దుబాయ్‌, కువైట్‌, సౌదీ అరేబియా, ఒమాన్‌, బెహ్ర‌యిన్ దేశాల‌పై ఇరాన్ డ్రోన్ల‌తో దాడులు చేస్తుంది. ఈ ప‌రిస్థితుల్లో  ముంబయి, చెన్నై, తూత్తుకూడి పోర్టుల్లోనే కొబ్బ‌రి కాయలతో కంటెయినర్లు నిలిచిపోయాయని అంబాజీపేట కొబ్బ‌రి మార్కెట్‌కు సంబందించిన కొబ్బ‌రి వ్యాపారులు, రైతులు చెబుతున్నారు.

యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఆయా దేశాలకు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందంటున్నారు. ఆయా ఓడరేవుల్లో ఉన్న సరకును స్థానికంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ధరల పతనంతో తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామంటున్నారు. 

ఆశాజ‌న‌క స్థితి నుంచి నిరాశ వైపు..

గత నెలలో శివరాత్రి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని, వెయ్యి పచ్చి కాయలు రూ.18-20 వేలు పలికాయని రైతులు వెల్ల‌డించారు. కురిడీల ధరలూ బాగానే ఉండ‌గా శ్రీరామనవమికి దేశవ్యాప్తంగా మంచి ధర వస్తుందని వ్యాపారులు ఆశించారు. ఓడరేవుల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే కొబ్బరికాయలు అక్కడే నిలిచిపోవడంతో ధరలపై ప్రభావం చూపిందంటున్నారు. 

దీంతో ప్రస్తుతం వెయ్యి కాయలు రూ.13-14 వేలకు పతనమయ్యాయని వ్యాపారులు రైతులు అంటున్నారు. ఏపీలో కొబ్బరికి ప్రసిద్ధి చెందిన కోనసీమ జిల్లా అంబాజీపేటలో కొబ్బరికి పెట్టింది పేరు. అలాంటి ప్రాంతం నుంచి రోజు ఇతర రాష్ట్రాలకు పదుల సంఖ్యలో లారీలు ఎగుమతి అయ్యేవి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎగుమతులు పూర్తిగా పడిపోయి కొబ్బరి పచ్చికాయ కురిడికాయ ధరలు అమాంతంగా ప‌డిపోవ‌డంతో అటు వ్యాపారులు ఇటు రైతులు ఆవేదన చెందుతున్నారు.