కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

Continues below advertisement

ప్రమాద తీవ్రతను చూసి మంత్రి దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

Continues below advertisement

ప్రమాదంలో గాయపడిన వారికి కాకినాడ జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఈ హృదయవిదారక ఘటనలో ఇప్పటివరకు 21 మంది మరణించినట్లు సమాచారం.

ప్రమాద స్థలంలో మృతదేహాలను చూస్తుంటే చాలా బాధగా ఉందని మంత్రి దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ పేలుడు ఘటన అత్యంత హృదయవిదారకం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు అవసరమైన ఆర్థిక మరియు సామాజిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులను మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది.

కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాణా సంచా తయారీ ఘటన బాధితులను మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. స్వయంగా బాధితులను కలిసి తాము అండగా ఉంటామని, ఆందోళన అవసరం లేదని ధైర్యం చెప్పారు.  త్వరితగతిన బాధితులు కోలుకోవాలని ఆకాంక్షించారు.