18 people killed in Samarlakota fire accident: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. వేట్లపాలెం గ్రామ శివారులోని సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో 18 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు . మృతుల్లో అత్యధికులు మహిళలే ఉండటం పెను విషాదాన్ని నింపింది. శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడమే కాకుండా, పేలుడు శబ్దం సుమారు 5 నుండి 7 కిలోమీటర్ల మేర వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే అంబులెన్స్‌లలో కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనితను సీఎం ఆదేశించారు.
మంత్రి నారా లోకేష్ సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. శ్రమజీవులైన కార్మికులు ఇలాంటి ప్రమాదానికి గురవ్వడం మనసును కలచివేస్తోందని, నిబంధనల అతిక్రమణపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. హోంమంత్రి అనిత, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రాథమిక విచారణ ప్రకారం, బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం లేదా రసాయనాల మిశ్రమంలో జరిగిన పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాణసంచా ఫ్యాక్టరీ అడబాల అర్జున్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినదిగా తెలుస్తోంది.
