Kakinada Brain Surgery: కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు ఓ పేషెంట్‌కు సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా చూపిస్తూ రోగి తెలివిలో ఉండగానే ఈ సర్జరీని పూర్తి చేశారు. ఇలాంటి ప్రక్రియను అవేక్ క్రానియోటమీ అంటారు. ఒక మహిళా రోగికి ఇలా బ్రెయిన్ ట్యూమర్‌ను డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. సున్నితమైన నాడులు దెబ్బతినకుండా చేసిన ఈ సర్జరీ ఆస్పత్రిలో ఇదే తొలిసారి అని డాక్టర్లు చెబుతున్నారు.


తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి అనే 55 ఏళ్ల రోగి తన కుడి చేయి, కుడి కాలు బలహీనతతో బాధ పడుతోంది. అనేక ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించగా.. చికిత్స ఖరీదైనది ఊరుకున్నారు. ఆమెకు తలనొప్పి, ఫిట్స్, బాడీ కుడి వైపున తిమ్మిరిగా ఉండడం కారణంగా సెప్టెంబర్ 11 న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమె మెదడుకు ఎడమవైపున 3.3 x 2.7 సెంటీ మీటర్ల కణితిని డాక్టర్లు గుర్తించారు.


మంగళవారం అనస్తీషియా డాక్టర్లు కొద్దిపాటి మత్తును అనంతలక్ష్మికి ఇచ్చి తెలివిలోనే ఉంచి సీనియర్ డాక్టర్లు శస్త్ర చికిత్స చేశారు. ఆమెకు సౌకర్యవంతంగా, పరధ్యానంలో ఉంచడానికి, డాక్టర్లు జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం నటించిన అదుర్స్‌లోని ఆమెకు ఇష్టమైన కామెడీ సీన్లను చూపించారు. దీంతో రోగి ఆ చిత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తుండగానే డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగింది. ఆ ర్వాత రోగి లేచి కూర్చుని అల్పాహారం కూడా తిన్నట్లుగా డాక్టర్లు చెప్పారు. 5 రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.


అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే ఏంటి?


రోగి మేల్కొని ఉండగానే మెదడు శస్త్రచికిత్స చేస్తారు. దీనిని అవేక్ క్రానియోటమీ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా మెదడు కణితులు లేదా మూర్ఛ వంటి నాడీ సంబంధిత పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. దృష్టి, కదలిక సహా ఇతర అన్ని పనులకు కారణమైన మెదడులోని కీలక ప్రాంతాలను దెబ్బతీయకుండా వైద్య బృందానికి సహాయం చేయడానికి శస్త్రచికిత్స సమయంలో రోగి స్పృహలో ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రోగి ప్రతిస్పందనలు చూసి.. సర్జన్ సరైన ప్రాంతానికి చికిత్స చేస్తున్నామా లేదా అని నిర్ధారించుకుంటాడు. 


అవేక్ క్రానియోటమీ ఎప్పుడు అవసరం ఉంటుంది?
కణితిని తొలగించేటప్పుడు అది మెదడులోని ఇతర సున్నిత ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు ఈ పద్ధతిని వాడతారు. శస్త్రచికిత్స సమయంలో రోగితో కమ్యూనికేట్ చేయగలగడం వల్ల సర్జన్ ఈ కీలక ప్రాంతాలను గుర్తించి వాటి జోలికి పోకుండా అనవసరమైన భాగాన్ని తీసేయగలుగుతారు. ఈ విధానంలో రోగికి తేలికైన మత్తు ఇస్తారు. కానీ మెలకువగా ఉంటారు. సర్జన్ రోగిని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొన్ని రకాల కదలికలు చేయమని కూడా అడగవచ్చు. తద్వారా ముఖ్యమైన మెదడు భాగాలకు ఎటువంటి నష్టం జరగకుండా చూడొచ్చు. ఇలా రియల్ టైంలో సర్జరీ చేయడం ప్రమాదాలను తగ్గిస్తుంది. మరియు ప్రభావిత ప్రాంతాన్ని ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడంలో సర్జన్‌కి సహాయపడుతుంది.