కేటుగాళ్లు ఎంత దారుణానికైనా ఒడిగట్టి ఈజీ మనీ కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. రోజురోజుకీ సైబర్ నేరాలు ఎక్కువవుతుండగా టెక్నాలజీని ఉపయోగించి ఏకంగా అధికారుల డీపీలతోనే వాట్సాప్ మెసేజ్ లు పంపి డబ్బు గుంజేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులే తమకు డబ్బు అవసరమని అడుగుతున్నట్లు ఫేక్ వాట్సాప్ మెసేజ్ లు పంపించి ఏదోలా చీటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కాకినాడ కలెక్టర్ కృతిక శుక్లా పేరున లక్షల్లో అధికారుల నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించాడు ఓ కేటుగాడు. అప్రమత్తమైన అధికారులు ధైర్యం చేసి కలెక్టర్ నే స్వయంగా అడగడంతో అసలు విషయం బట్టబయలైంది. ఇంతకీ కలెక్టర్ పేరుతో మోసపూరితమైన మెసేజ్లు పంపించిన కేటుగాడి అడ్రస్ గురించి ఆరా తీస్తే ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఫోన్ నంబర్ కు డీపీగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఫొటో పెట్టుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.


అధికారులను ఇలా బురిడీ కొట్టించాలని ప్రయత్నం
“నేను మీటింగ్లో ఉన్నాను.. మాట్లాడే పరిస్థితిలో లేను.. అర్జంట్ గా నాకు డబ్బు కావాలి.. అమెజాన్ పేలో డబ్బులు పంపించండి” కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా చిత్రం డీపీగా ఉన్న వాట్సాప్ నంబరుతో మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న  పలువురు జిల్లాస్థాయి అధికారులకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. జిల్లా సీపీవో, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ, డ్వామా పీడీ ఇలా చాలామంది అధికారులకు ఈ మెసేజ్ లు వచ్చాయి. అసలు కలెక్టర్ తమను డబ్బులు అడగడం ఏంటి? ఎప్పుడు ప్రభుత్వపరమైన అంశాలు గురించి కూడా ఆమె నేరుగా ఫోన్లో మాట్లాడరు. మీటింగ్ ద్వారానే చర్చిస్తారు. ఎక్కడో తేడా కొడుతుంది అనుకుని కొందరు అధికారులు తమకు తాము ఫోన్లు చేసుకుని చర్చించుకున్నారు. వాట్సాప్ డీపీగా కలెక్టర్ ఫొటో ఉన్నా.. నంబరు మాత్రం వేరేగా ఉందడంతో మరింత అనుమానం వచ్చి ధైర్యం చేసి ఓ అధికారి నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.


ఒక్కసారిగా షాక్ అయిన కలెక్టర్ కృతిక శుక్లా గతంలో ఇలానే చోటు చేసుకున్న పలు సంఘటనలు గుర్తు చేస్తూ ఇవి ఫేక్ మెసేజ్ లని.. దీనిపై ఎవరూ కూడా రెస్పాండ్ కావలసిన అవసరం లేదని, ఎవ్వరు డబ్బులు పంపించవద్దని అధికారులు అందరిని అప్రమత్తం చేసి వెంటనే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో మాట్లాడి పరిస్థితి వివరించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని కింది స్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.


ఉత్తరప్రదేశ్ ముఠా పనేగానే నిర్ధారణ
కలెక్టర్ పేరుతో మోసపుచ్చే ప్రయత్నం చేసింది ఉత్తరప్రదేశ్ కు చెందిన హరి ఓం గుప్తాగా పోలీసులు గుర్తించారు. వాట్సాప్ నంబరు 70173 02622 ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు ప్రత్యేక బృందాన్ని పంపించారు. గతంలో ఇదే ముఠా ఇటువంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా పని పట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఉదంతంపై కాకినాడ త్రీ టౌన్ పరిధిలో సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.