ఒక్కో సారి చిన్న చిన్న కేసులే చిక్కక, దొరకని కేసులను సైతం బట్టబయలు చేస్తుంటాయి.. అనుమానంతో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారిస్తే ఒక కేసు బయట పడిరది.. మరింత లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తే ఏకంగా 18 కేసులు బయటపడ్డాయి.. చిక్కక దొరకక కేవలం చోరీల ద్వారా లక్షల రూపాయల బంగారం, వెంట ఆభరణాలను కొట్టేసి దర్జాగా జల్సాలు చేస్తున్న దొంగల ముఠా పోలీసులకు చిక్కింది.
పాపం పండి కటకటాల పాలు
కాకినాడ జిల్లాలో గత కొంత కాలంగా మొదలైన ఈ దొంగల ఇష్టారాజ్యం కేవలం కాకినాడ జిల్లాలోనే కాకుండా తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం సాగింది.. చివరకు పాపం పండి కటకటాల పాలు చేసింది.. వీరు చోరీ ద్వారా కొట్టేసిన సొత్తును చూసిన పోలీసులే కళ్లు బైర్లు కమ్మి విస్తుపోవడం వారి వంతయ్యింది.. ఈ ముగ్గురు దొంగల ముఠా గురించిన వివరాలను కాకినాడ జిల్లా ఎస్పీ జి.బింధు మాధవ్ ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, ఏఎస్పీపాటిల్ దేవరాజ్‌తో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాకినాడ జిల్లా పరిధిలో రాత్రివేళల్లో ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారన్న అనుమానంతో నిఘా పెట్టిన కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణకు వచ్చిన ఓ సమాచారం మేరకు గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్‌కుమార్, కరప ఎస్సై టి.సునీత, క్రైం టీమ్‌ను అప్రమత్తం చేశారు.. దీంతో నిఘా పెట్టిన వీరికి ఓ చోరీ కేసులో తాళ్లరేవు మండలం జి.వేమవరంకు చెందిన బగడ శ్రీను అలియాస్ బట్టి శ్రీను అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది.. అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు.. దీంతో తీగ దొరికింది.
దొంగతనాల డొంక కదిలింది
పోలీసులు అనుమానించిన కేసులో కీలక నిందితునిగా గుర్తించిన పోలీసులు అతనితోపాటు ఈ ముఠాలో ఇంకెవరు ఉన్నారన్నదానిపై దృష్టిసారించి దర్యాప్తు చేశారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన పాశి శేఖర్ అనే యువకుడు, ఇదే ప్రాంతానికి చెంది ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉంటున్న పోతంశెట్టి సూర్యభాస్కరరెడ్డి పేర్లు బయటకు వచ్చాయి.. దీంతో మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు దొంగతనాల డొంక కదిలింది..
రూ.66 లక్షలు విలువచేస్తే చోరీ సొత్తు స్వాదీనం..
పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా సభ్యులు పాత నేరస్తులే.. వీరంతా జైలులో పరిచయం ఏర్పడగా బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో ఇళ్లల్లో కి చాలా నేర్పుగా చొరబడడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.. అలా దొంగతనాలు చేసి బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు.. మొత్తం వీటి విలువ రూ.66 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఈ ముఠా దొంగతనాలు ద్వారా చోరీ చేసిన సొత్తును మొత్తం రికవరీచేశామని, గతంలో నమోదైన కేసులు 18 కేసుల ఆధారంగా పోగొట్టుకున్న ఫిర్యాదు దారులకు రికవరీ సొత్తును అప్పగిస్తామని ఎస్పీ తెలిపారు.
ఒక్కొక్కరిపై చాలా కేసులు..
ప్రధాన నిందితుడు బగడ శ్రీను అలియాస్ బట్టి శ్రీను పై గతంలో తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 13 నేరాలకు పాల్పడిన కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో ఒక ఏడాది పాలు జైలు శిక్ష కూడా అనుభవించాడని, ఇతనిపై కడియం పోలీస్ స్టేషన్‌లో 2021 నుంచి సస్పెక్ట్ షీట్ కూడా ఉందని వెల్లడిరచారు. ఇక ఏ2గా ఉన్న పాశి శేఖర్ పై గతంలో తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు కేసులు ఉన్నాయన్నారు.
ఏ3 నిందితుడు పోతంశెట్టి సూర్య భాస్కరరెడ్డిపై గతంలో తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 5 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని చెప్పారు. ముగ్గురు నిందితులను కాకినాడ స్పెషల్ ఏజేఎఫ్‌సీఎం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంతోపాటు చోరీ సొత్తు రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్య కృష్ణ, గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్, కరప ఎస్సై టి.సునీత, ఏఎస్‌ఐ ఎస్.శ్రీనివాసరావు, హెచ్‌సీ జి.మోహన్‌కుమార్ తదితరులను ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.