Janasena Varahi Yatra:

- అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్‌ డివిజన్‌ల‌ పరిధిలో సెక్షన్‌ 30 పోలీసు యాక్ట్‌ అమలు 

- వారాహి యాత్రను అడ్డుకోవాలనే అంటున్న జనసేన నాయకులు
- అయిదు నియోజ‌క‌వర్గాల ప‌రిధిలో పోలీసు ఆంక్ష‌లు

 

అమలాపురం అల్లర్ల కారణంగా దాదాపు ఆరు నెలల పాటు అమలుల్లో ఉన్న సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ దశలు దశలుగా ఎత్తివేశారు. అయితే అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్‌, కొత్త‌పేట డీఎస్పీ కేవీ ర‌మ‌ణ  పేరుతో అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఈ రోజు  (జూన్‌ 10) అర్ధరాత్రి నుంచి  సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటుందని ఆ ప్రకటలో తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరగడానికి వీల్లేదు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తరువాత దాదాపు మూడు నెలల కిందట ఎత్తేసిన సెక్షన్‌ 30 ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు విధించారన్న దానిపై స్థానికంగా తీవ్ర చర్ఛ జరుగుతోంది.  కొత్తపేట పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి  కొత్తపేట, రావులపాలెం,ఆలమూరు, ఆత్రేయపురం ,పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, నగరం ,రాజోలు ,సఖినేటిపల్లి మల్కిపురం,  పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది.

 

వారాహి యాత్రకు ఆటంకాలు...! 

ఈనెల 14 నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో ప్రారంభమయ్యే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర అమలాపురం, కొత్తపేట పోలీస్  సబ్‌ డివిజన్‌ ల ప‌రిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుతుంది. ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ తెరమీదకు తీసుకువచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగమే సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ ప్రయోగమని జనసేన నేతలు మండిపడుతున్నారు.

 

అయిదు నియోజకవర్గాల పరిధిలో ప్రభావం..

ప్రస్తుతం అమలాపురం, కొత్తపేట సబ్‌ డివిజన్‌ల పరిధిలో సెక్షన్‌ 30 అమలుతో నిషేధాజ్ఞల ప్రభావం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం పడనుంది. ఈ  నియోజవర్గాలన్నీ  జనసేనకు పట్టున్నవే.  ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నుంచి ప్రారంభం కానున్న నిషేదాజ్ఞలు మాత్రం ముమ్మిడివరం నుంచి తాకనున్నాయి. తాజాగా పోలీసులు జారీ చేసిన ప్రకటనలో అమలాపురం పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం తాలూకా, అమలాపురం టౌన్‌ పోలీసు స్టేషన్లు మాత్రమే చేర్చారు. కొత్తపేట పోలీసు సబ్ డివిజన్ పరిధిలో కొత్తపేట, రావులపాలెం,ఆలమూరు, ఆత్రేయపురం ,పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, నగరం ,రాజోలు ,సఖినేటిపల్లి మల్కిపురం,  పోలీస్ స్టేషన్ల పరిధిఅంటే ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాలు ఈ పరిధిలోకి రానున్నాయి. దీంతో ముమ్మిడివ‌రం, అమ‌లాపురం, పి.గ‌న్న‌వ‌రం, రాజోలు నియోజ‌కవర్గాలు ప్ర‌త్య‌క్షంగాను, కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రోక్షంగానూ పోలీసు ఆంక్షల ప్ర‌భావం ప‌డ‌నుంది.

 

అమలాపురం నియోజకవర్గంలో 3 రోజులపాటు వారాహి యాత్ర..

ప్రస్తుతం అమలాపురం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ ద్వారా నిషేదాజ్ఞలు, ఆంక్షలు విధించగా అమలాపురం నియోజకవర్గ పరిధిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు జరగనుంది.. జిల్లా కేంద్రమైన అమలాపురంలో కూడా బహిరంగ సభ జరిపేందుకు జనసేన నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపధ్యంలోనే అమలాపురం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30 అమలు చేస్తున్నారని, పవన్‌ కళ్యాణ్‌ వారాహియాత్రకు ఆటంకం కలిగించేందుకే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా కుటిలయత్నం చేస్తోందని జనసేన నాయకులు ఆరోపణలు గుప్తిస్తున్నారు.. అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి దాటాక కూడా పి.గ‌న్న‌వ‌రం, రాజోలు నియోజ‌క‌వ‌ర్గాల్లో నిషేదాజ్ఞ‌లు ఎదుర్కోవ‌ల‌సి వస్తుంది..

 

అమలాపురం అల్లర్ల కారణంగా సుదీర్ఘకాలం.. 

గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న అమలాపురం అల్లర్లతో విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్న క్రమంలో అమలాపురం పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో దాదాపు ఆరు నెలలు పైబడి సెక్షన్‌ 30 అమలు చేశారు. ఆతరువాత కొన్ని రోజులు ఎత్తివేసినప్పటికీ మళ్లీ అరెస్ట్‌లు షురూ అయిన క్రమంలో మరోసారి ఇదే సెక్షన్ అమలు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెక్షన్‌ 30 ఎత్తివేసి దాదాపు మూడు నెలలు దాటిపోయింది. పవన్ వారాహి యాత్ర మొదలవుతుందన్న సమయంలోనే సెక్షన్‌ 30 అమలు చేయడం చర్చకు దారితీసింది. దీనిపై పోలీసులు వర్గాలు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే సెక్షన్‌ 30 అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.